అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత్‌లో కాలు మోపబోతున్నారు. తనతో పాటే కోడి కాళ్లనూ ఈ గడ్డపై మోపడానికి సమాయత్తమయ్యారు!! ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలో ఏళ్లుగా గుట్టలుగా పేరుకుపోయిన చికెన్‌లెగ్స్ (కోడి కాళ్లు)ను భారత్‌కు విక్రయించే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఇందుకు సిద్ధపడిన భారత్- చికెన్ లెగ్‌లపై ఉన్న 100 శాతం దిగుమతి సుంకాల్ని 25 శాతానికి తగ్గించడానికి అంగీకరిస్తున్నట్లు సమాచారం. 10 శాతానికి తగ్గించాలని అమెరికా పట్టుబడుతోందట. ట్రంప్ పర్యటనలో దీనిపై అవగాహన కుదిరితే- రెండు దేశాలూ పరిమిత వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయొచ్చు. భారత పాడి పరిశ్రమలోకి అమెరికాను పరిమిత స్థాయిలో అనుమతించడానికీ అంగీకారం కుదరొచ్చు.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోళ్ల పరిశ్రమ
అమెరికా చికెన్‌లెగ్స్‌ను దిగుమతి చేసుకుంటే ఘోరంగా నష్టపోతామని దేశీయ కోళ్ల పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనివల్ల లక్షలాది కోళ్ల ఫాంలు మూతబడతాయని, వాటిపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిని కోల్పోతారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని పరిశ్రమ ఆందోళన వ్యక్తంచేస్తోంది.
ఆనాడే నిషేధం
బర్డ్‌ఫ్లూ కారణంతో 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)కు అమెరికా ఫిర్యాదుచేసింది. 2014 అక్టోబరులో తీర్పు అమెరికా పక్షాన వచ్చింది. అయితే ఆ తీర్పును అమలుచేయటానికి ఆ తర్వాత వచ్చిన మోదీ సర్కారు అంగీకరించలేదు. చివరికి డబ్ల్యూటీవో ద్వారా అమెరికా ఒత్తిడి తేవడంతో 2017లో చికెన్‌లెగ్స్ దిగుమతికి భారత్ అంగీకరించింది. మనదేశంతో వాణిజ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి ట్రంప్ వస్తున్నారు. రెండుదేశాల మధ్య 2018లో 14,000 కోట్ల డాలర్లున్న వాణిజ్యాన్ని మున్ముందు 50,000 కోట్ల డాలర్లకు పెంచాలనేది రెండు దేశాల లక్ష్యం.