ఠాక్రేకు ప్రధాని శుభాకాంక్షలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి బాధ్యతలు ఠాక్రే శ్రద్ధగా నిర్వర్తిస్తారన్న నమ్మకం ఉందని ట్వీట్ చేశారు.
19:22 November 28
ఠాక్రేకు ప్రధాని శుభాకాంక్షలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి బాధ్యతలు ఠాక్రే శ్రద్ధగా నిర్వర్తిస్తారన్న నమ్మకం ఉందని ట్వీట్ చేశారు.
19:07 November 28
మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బాల్‌ఠాక్రే తనయుడు, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. బాల్‌ఠాక్రే పలు కీలక ప్రసంగాలు చేసిన దాదర్‌లోని శివాజీపార్క్‌లో ఉద్ధవ్ సీఎంగా ప్రమాణం చేశారు. మహా అఘాడీ వికాస్ కూటమి పార్టీల కీలక నేతలు శివసేన కార్యకర్తల కోలాహలం నడుమ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఉద్ధవ్ ఠాక్రేతో ప్రమాణ స్వీకారం చేయించారు.. ఛత్రపతి శివాజీ, తల్లిదండ్రులను స్మరిస్తూ దైవసాక్షిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం చేశారు.
ఆరుగురితో మంత్రివర్గం
శివసేన నుంచి ఆ పార్టీ శాసనసభాపక్షనేత ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్సీపీ నుంచి చగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్ ప్రమాణ స్వీకారం చేశారు.
శాసనసభకు ఎన్నిక కాకుండానే..
మహా వికాస్ అఘాడీ తరుఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే, శాసనసభకు, శాసనమండలికి ఎన్నిక కాకుండానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిదో వ్యక్తిగా నిలిచారు. కాంగ్రెస్ నేతలు ఏఆర్ అంతులయ్, వసంత్‌దాదా పాటిల్, శివాజీ రావ్ నీలాంగేకర్ పాటిల్ ,శంకర్ రావ్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ గతంలో ఎమ్మెల్యే గా , ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండానే.. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం ఇదే రీతిలో గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రమాణం స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే ఎనిమిదో వ్యక్తిగా నిలిచారు.
ప్రముఖుల హాజరు
ఉద్ధవ్ ప్రమాణ స్వీకారానికి డీఎంకే అధినేత స్టాలిన్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. వీరితో పాటు భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుటుంబం, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఉద్ధవ్ ప్రమాణానికి... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దూరంగా ఉన్నారు. ఈ మేరకు ఉద్ధవ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు.
ఠాక్రే కుటుంబం నుంచి తొలి వ్యక్తి
ఠాక్రే కుటుంబం నుంచి ప్రభుత్వంలో పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా.. ఉద్ధవ్ నిలిచారు. శివసేన నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడోవ్యక్తిగా ఉద్ధవ్ గుర్తింపు పొందారు. గతంలో మనోహర్‌జోషి, నారాయణ్‌రాణే శివసేన నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
18:42 November 28
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు.
18:21 November 28
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో మహా సీఎంగా ప్రమాణం చేయనున్నారు శివసేన అధినేత. ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
17:03 November 28
ఉద్ధవ్‌కు సోనియా లేఖ
కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
"భాజపా కారణంగా దేశం ఎన్నడూ లేని ముప్పుల్ని ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఏకతాటిపైకి రావాల్సి వచ్చింది. దేశంలో రాజకీయ వాతావరణం విషపూరితమైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించున్నాయి. ఈ ప్రణాళికను మూడు పార్టీలు చిత్తశుద్ధితో అమలు చేసి, ప్రజల అంచనాలను అందుకుంటాయని విశ్వసిస్తున్నా."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
16:21 November 28
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ముంబయి శివాజీ పార్క్ వేదికగా సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖుల రాక దృష్ట్యా భారీగా భద్రతా బలగాలు మోహరించారు.
ఆరుగురు మంత్రులు...
ఆరుగురు మంత్రులతో ఉద్ధవ్ ప్రభుత్వం కొలువుదీరనుంది. కూటమిలోని సభ్య పార్టీలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున... ఈ సాయంత్రం మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్ మంత్రివర్గంలో చేరనున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్, రాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్ ఉద్ధవ్ సర్కార్‌లో భాగస్వామి అయ్యే అవకాశముంది.
శివసేన నుంచి ఏక్‌నాథ్ శిందేకు మంత్రి పదవి ఖరారైనట్లు సమాచారం. మరొక మంత్రి ఎవరన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
అజిత్ లేకుండానే...
ఉద్ధవ్ ప్రభుత్వంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తొలుత ఊహాగానాలు వినిపించాయి. అయితే తాను ఈరోజు ప్రమాణం చేయడంలేదని ఆయన స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం పదవిపై పార్టీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
డిసెంబర్ 3న రెండో దశ...
డిసెంబర్ 3న ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గాన్ని విస్తరిస్తారని సమాచారం. అజిత్‌కు ఉపముఖ్యమంత్రి పదవి సహా ఇతర మంత్రులు ఎవరన్న అంశంపై అప్పటికి స్పష్టత వచ్చే అవకాశముంది.
14:33 November 28
సాయంత్రం మహారాష్ట్ర మంత్రిగా తాను ప్రమాణం చేయడంలేదని స్పష్టంచేశారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. ఉపముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపడతారన్న వార్తల మధ్య అజిత్ ఈ ప్రకటన చేశారు. ఎన్సీపీ నుంచి ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్ మాత్రమే నేడు ప్రమాణం స్వీకారం చేస్తారని ముంబయిలో శరద్ పవార్ నివాసంలో జరిగిన పార్టీ నేతల సమావేశం తర్వాత వెల్లడించారు అజిత్.
"ఒక్కో పార్టీ(ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్) నుంచి ఇద్దరు చొప్పున ఈరోజు మొత్తం ఆరుగురు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై పార్టీ నిర్ణయం తీసుకోవాలి."
- అజిత్ పవార్, ఎన్సీపీ నేత
12:39 November 28
ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం ఆయన అనూహ్యంగా శరద్ పవార్‌ను వీడి వెళ్లి, భాజపాకు మద్దతు తెలిపిన నేపథ్యంలో... ప్రస్తుత పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే... ఈ ఊహాగానాలన్నింటినీ తోసిపుచ్చారు ఎన్సీపీ అధికార ప్రతినిధి. తరచుగా కాల్స్ వస్తున్నందునే అజిత్ ఉద్దేశపూర్వకంగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని స్పష్టంచేశారు. సాయంత్రం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరవుతారని చెప్పారు.
10:35 November 28
ఉద్ధవ్‌తో పాటు ఇంకెవరు?
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే. ఇందుకు ముంబయిలోని శివాజీ పార్కు ముస్తాబువుతోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిరథమహారథులు తరలివెచ్చే అవకాశమున్న తరుణంలో భద్రతా పరిణామాలపై అధికారులు అధిక దృష్టి సారించారు.
ఉద్ధవ్‌తో పాటు...
ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్.. మహారాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.
ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు మద్దతిచ్చి సంచలనం సృష్టించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశముందని తెలుస్తోంది. అయితే.. నేడు అజిత్ ప్రమాణస్వీకారం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
సోనియా నిర్ణయం...
ప్రమాణస్వీకార మహోత్సవానికి అథిరథమహారథులను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
10:19 November 28
సోనియా ఇంకా నిర్ణయించుకోలేదు
ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందాయి. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సోనియా తెలిపారు. రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా స్పందించారు. ప్రమాణస్వీకారానికి మరికొద్ది గంటలే మిగిలున్న వేళ సోనియా నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
10:16 November 28
ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్!
ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు మద్దతిచ్చి సంచలనం సృష్టించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కే ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశముందని ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈరోజు ఉద్ధవ్‌తో కలిసి అజిత్ ప్రమాణ స్వీకారం చేయరని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
10:12 November 28
శివాజీ పార్కులో...
సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం చేయనున్న శివాజీ పార్కులో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అతిరథమహారుథులను కార్యక్రమానికి ఆహ్వానించిన తరుణంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
10:09 November 28
ముంబయి ముస్తాబు...
ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం కోసం ముంబయి నగరం ముస్తాబవుతోంది. నగరవ్యాప్తంగా ఉన్న రహదారులపై ఉద్ధవ్ ఠాక్రే ఫ్లెక్సీలు వెలిశాయి.
09:52 November 28
నేడు ఉద్ధవ్ ప్రమాణస్వీకారం
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాడీ సర్కార్ స్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్దవ్‌ఠాక్రే.. నేడు ప్రమాణం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 6:40 గంటలకు దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.