తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2020, 7:39 AM IST

Updated : Feb 18, 2020, 2:00 AM IST

ETV Bharat / bharat

ఫిరాయింపులపై 'సుప్రీం' అస్త్రం

చట్ట సభ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, ఆ కోణంలో జాతి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు సభాపతి ప్రతినిధిగా నిలుస్తారు. అన్ని వేళలా అసాధారణ సామర్థ్యం, నిష్పాక్షికత మూర్తీభవించిన వ్యక్తులే అలంకరించాలని తొలి ప్రధాని పండిత నెహ్రూ చేసిన వ్యాఖ్యలవి. గోడదూకుడుగాళ్ల అనైతిక పోకడలకు కళ్లెం వేసేందుకు ఎన్నో చట్టాలు వచ్చినప్పటికి నేటి ఫిరాయింపులు ఆగటం లేదు. అనర్హత పిటిషన్ల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో శాశ్వత ట్రైబ్యునల్‌ లేదా మరేదైనా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు సూచించింది.

The Supreme VERDICT
ఫిరాయింపులపై ‘సుప్రీం’ అస్త్రం

‘చట్టసభకు దాని గౌరవానికి స్వేచ్ఛకు స్పీకర్‌ ప్రతినిధి. సభ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, ఆ కోణంలో జాతి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు సభాపతి ప్రతినిధిగా నిలుస్తారు. అలాంటి గౌరవప్రద స్వేచ్ఛాయుత స్థానాన్ని అన్ని వేళలా అసాధారణ సామర్థ్యం, నిష్పాక్షికత మూర్తీభవించిన వ్యక్తులే అలంకరించాలి’- 1948 మార్చిలో తొలి ప్రధాని పండిత నెహ్రూ చేసిన వ్యాఖ్యలవి. రాజ్యాంగబద్ధ శాసన నిర్మాణ వేదికపై చర్చాసంవాదాల కలబోత దరిమిలా ప్రజోపయోగ చట్టాల రూపకల్పన నిష్ఠగా సాగేందుకు నిర్భీతి, నిష్పాక్షికతలే స్వతస్సిద్ధ లక్షణాలుగా రాజిల్లాల్సిన సభాపతుల పదవీ గౌరవాన్ని సంకుచిత రాజకీయ రాహువు ఎంతగా కబళిస్తోందో నడుస్తున్న చరిత్ర చాటుతోంది.

అధికారాన్ని ఒడిసిపట్టడానికో, ప్రత్యర్థి పక్షాన్ని చావుదెబ్బ కొట్టడానికో ఫిరాయింపుదారులకు అంబారీలు కట్టే పార్టీలకు మాన్య సభాపతుల లోపాయికారీ మద్దతు- ప్రజాతంత్ర వ్యవస్థపై ప్రజావిశ్వాసాన్నే ఖర్చు రాసేస్తోంది. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిన రీతిగా వాతావరణం నానాటికీ దిగజారుతున్న వేళ ‘సుప్రీం’ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు- కుటిల రాజకీయ కోటల్ని కూల్చేటంత ప్రభావాన్వితమైనది. 1985 నాటి ఫిరాయింపుల నిషేధ చట్టం ‘ఆయారామ్‌- గయారామ్‌’లపై వచ్చే ఫిర్యాదులను విచారించి ‘సహేతుక సమయం’లోపల తగు న్యాయనిర్ణయం చేసే అధికారాన్ని స్పీకర్లకు కట్టబెట్టింది.

స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకై..

గోడదూకుడుగాళ్ల అనైతిక పోకడలకు కళ్లెం వేసేందుకు ఉద్దేశించిన చట్టం ఆచరణలో చట్టుబండలు కావడానికి పలువురు సభాపతుల ‘రాజీ’కీయం పుణ్యం కట్టుకుంటోందని సరిగ్గానే గుర్తించిన న్యాయపాలిక- అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఫిరాయింపులపై ఫిర్యాదుల్ని మూడు నెలల్లో స్పీకర్లు తేల్చేయాలని నిర్దేశించింది. అంతటితో ఆగకుండా, అనర్హత పిటిషన్ల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో శాశ్వత ట్రైబ్యునల్‌ లేదా మరేదైనా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు సూచించింది. అలాంటి పటిష్ఠ యంత్రాంగం ఏర్పాటే రాజకీయ రంకులరాట్నాన్ని నిలువరించగలిగేది!

ఏడు దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో విస్తృతంగా దురుపయోగమై ప్రజాస్వామ్య స్ఫూర్తిని కబళించేలా రాజకీయ జగన్నాటకాలకు కేంద్ర బిందువుగా భ్రష్టుపట్టిన కీలక రాజ్యాంగ పదవులు రెండు. మొదటిది గవర్నర్లు, రెండు సభాపతులు! కేంద్రంలో పాలకపక్షం తాబేదార్లుగా రాజ్‌భవన్లలో తిష్ఠవేసి, 356 నిబంధన చేతపట్టి రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రత్యర్థి ప్రభుత్వాల తలారులుగా గవర్నర్ల వికృత కళాకేళికి సుప్రీంకోర్టే విస్పష్ట లక్ష్మణరేఖలతో పగ్గాలేసింది. తాజాగా మణిపూర్‌ అసెంబ్లీకి సంబంధించిన వ్యాజ్యంలో ఇచ్చిన తీర్పుద్వారా- అడ్డదారులే దొడ్డదారులుగా అధికార పరమపద సోపానాలు అధిరోహించే పార్టీలకు ముకుతాడు వేస్తోంది. 2017 మార్చి నాటి మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకుగాను 28 సీట్లు గెలిచి కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా నిలిచినా, 21 స్థానాల భాజపా చిన్నాచితక పార్టీల దన్నుతో కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే అండతో అధికారానికి వచ్చింది.

అభ్యర్థనల్ని పరిష్కరించకపోవటమే..

అమాత్య పదవిలో కులుకుతున్న ఫిరాయింపుదారుడిపై అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనల్ని సభాపతి ఎంతకూ పరిష్కరించకపోవడం తాజా తీర్పు నేపథ్యం! పిటిషన్లపై నిర్ణయాన్ని నాలుగు వారాల్లో ప్రకటించాలని మణిపూర్‌ సభాపతిని ఆదేశించిన న్యాయపాలిక- అనర్హత వేటు పడదగ్గవారు ఒక్కరోజు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కొనసాగరాదని స్పష్టీకరించింది. అనర్హత పిటిషన్లపై సహేతుక సమయంలోగా సభాపతి నిర్ణయం తీసుకోని పక్షంలో హైకోర్టు జోక్యం చేసుకొని న్యాయసమీక్ష జరపగలదన్న 2007 నాటి తీర్పును ఉదాహరించిన సుప్రీంకోర్టు- తాము ప్రాతినిధ్యం వహించే పార్టీతో స్పీకర్ల రాజకీయ బొడ్డు పేగు బంధం దృష్ట్యా స్వతంత్ర యంత్రాంగం ఏర్పాటును గట్టిగా ప్రస్తావించింది. శీలహీన రాజకీయ కశ్మలాన్ని ఊడ్చేయాలంటే, అలాంటి ఏర్పాటు తప్పనిసరి!

ఫిరాయింపుల జాడ్యాన్ని పరిమార్చకపోతే, అది దేశ ప్రజాస్వామ్య పునాదుల్నే కాదు, మౌలిక సూత్రాల్నీ దెబ్బతీస్తుందని మూడున్నర దశాబ్దాలనాటి చట్టం- రుగ్మతల తీవ్రతను ప్రస్తావించింది. వాస్తవంలో అది చిల్లర గోడదూకుళ్లకు కళ్ళెమేసి, టోకు ఫిరాయింపులకు లాకులెత్తడంతో రాజ్యాంగ అపచారాలు ముమ్మరించాయి. 1993లో గోవా శాసనసభాపతి ఫిరాయింపుదారులతో జట్టు కట్టి తానే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడం- రాజకీయ సంతలో చోటుచేసుకున్న వింత! 91వ రాజ్యాంగ సవరణను అమలులోకి తెచ్చి- పార్టీ నుంచి మూడోవంతు సభ్యుల వేరుకుంపటిని చీలికగా గుర్తించేది లేదన్నా ఫిరాయింపుల జోరు ఆగనే లేదు.

పాలకపక్షంగా ఫిరాయింపుల్ని ఎగదోసే పార్టీ, ప్రతిపక్ష స్థానంలో ఉంటే రాజ్యాంగ ధర్మపన్నాలు వల్లిస్తుండటం పరిపాటిగా మారింది. ఫిరాయింపులపై నిర్ణయాధికారం సభాపతి చేతిలో ఉండటం అధికార పార్టీ ఇష్టారాజ్యానికి రాచబాటలు పరుస్తోంది! ఇటీవల కర్ణాటకలో ఫిరాయింపు రాజకీయ కోలాటం శ్రుతిమించి తన సముఖానికి చేరినప్పుడు ‘రాజ్యాంగ సమతూకం’ పేరిట న్యాయపాలిక- పార్టీ ‘విప్‌’నకు లోబడాల్సిన అవసరం లేకుండా అసమ్మతి ఎమ్మెల్యేల నెత్తిన పాలు పోసింది.

ఇకమీదట అది ‘సంప్రదాయం’గా స్థిరపడే ప్రమాదం ఆలోచనాపరుల్ని కలచివేస్తున్న తరుణంలో- స్వతంత్ర యంత్రాంగం ఏర్పాటు ఆవశ్యకతను గట్టిగా సూచిస్తూ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతించాలి. అది ఏర్పాటయ్యేలోగా సభాపతులకు నిర్దేశించిన మూడు నెలల కాలపరిమితి- అధికారమే పరమావధిగా సాగుతున్న దుర్రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తుంది! ఫిరాయింపు వేటుపడ్డవాళ్లకు ఏ అధికార పదవులూ దక్కకుండా గట్టి నిషేధాలు అమలైనప్పుడే ఆ జాడ్యం పూర్తిగా ఉపశమిస్తుంది!

ఇదీ చూడండి : సీఏఏపై స్టేకు సుప్రీం నో- రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదిలీ

Last Updated : Feb 18, 2020, 2:00 AM IST

ABOUT THE AUTHOR

...view details