కరోనా వైరస్‌పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా అనేక మంది తమవంతు విరాళాలు ఇస్తున్నారు. అయితే కేరళకు చెందిన సుబైదా.. తనకున్న కష్టాలను లెక్కచేయకుండా విరాళం అందించి మానవత్వాన్ని చాటుకుంది. ఇందుకోసం తన రెండు మేకలను అమ్మేసింది.
ఎన్ని కష్టాలున్నా...
కొల్లమ్ పోర్టు కార్యాలయం సమీపంలో టీ కొట్టు నడుపుతోంది సుబైదా. అదే ఆమెకు జీవనోపాధి. రోజూ టీవీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియా సమావేశాన్ని చూస్తుంది. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితులు సుబైదాను ఎంతో బాధపెట్టాయి. దేశానికి ఎలాగైనా సేవ చేయాలని.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆలోచించింది. కానీ తన టీ దుకాణంపైనా లాక్డౌన్ ప్రభావం పడింది. దీంతో ఆదాయం లేకపోవడం వల్ల చివరకు తన వద్ద ఉన్న రెండు మేకలను అమ్మేసింది సుబైదా. వాటితో ఆమెకు 12వేల రూపాయలు వచ్చాయి. అందులో రూ. 5,510ను సీఏం సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. కొల్లమ్ జిల్లా కలెక్టర్ బీ అబ్దుల్ నాజర్‌కు ఈ మొత్తాన్ని అందించింది.