ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా దేశంలోని పేదలకు ఆహార పదార్థాలు అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కరోనా నేపథ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు చేయూత అందించేందుకు అమలు చేస్తోన్న ఉచిత సరఫరా పథకాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఆరు నెలల పాటు 10 కిలోలు..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితుల్లో వలస కూలీలకు ఆహార భద్రత కల్పించాలని కోరారు సోనియా గాంధీ. ఆహార భద్రత కార్డు లేని వారికీ.. ఈ పథకాన్ని వర్తింప చేయాలని అభ్యర్థించారు. ఆరు నెలల పాటు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఉచితంగా అందించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఆహారం కోసం అలమటించే పరిస్థితిలోకి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సోనియా. ప్రజలను ఆహార ద్రవ్యోల్బణం బారిన పడకుండా కాపాడతారనే ఉద్దేశంతోనే ఈ సూచనలు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.