సరైన ప్రణాళిక అమలయ్యే వరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతారని ఆ పార్టీ ప్రకటించింది. కొత్త అధ్యక్షుడి ఎంపికకు ప్రణాళిక అమలు ఎంతో దూరంలో లేదని వెల్లడించింది. రేపటితో కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రిగా సోనియా ఏడాది పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆన్లైన్ మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతుందనే భావన ప్రజల్లో పెరగకముందే పూర్తిస్థాయి సారథి ఎంపిక కసరత్తు వేగవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అభిప్రాయపడ్డారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీకి అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకు ఆయన సుముఖంగా లేకుంటే మరొకరిని ఎన్నుకోవాలని వెల్లడించిన నేపథ్యంలో ఈ మేరకు పార్టీ స్పష్టతనిచ్చింది.
"కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీకాలం ఆగస్టు 10న ముగుస్తుంది. కానీ, ఆమె పదవీ కాలం ముగిసినా వెంటనే ఖాళీ ఏర్పడదు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రణాళిక అమలయ్యే వరకు సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగుతారు. అది ఎంతో దూరంలో లేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ద్వారా ఈ ప్రణాళిక అమలు జరుగుతుంది."