తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పొగ రాయుళ్లకు కరోనాతో పెను ముప్పు!

పొగతాగే వారికి కరోనా మహమ్మారి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. ముందుగా రుచి, వాసన చూసే శక్తి పోయి.. పూర్తి నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ధూమపానం చేసే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Smokers
పొగతాగే వారికి కరోనా గండం!

By

Published : Apr 29, 2020, 6:39 PM IST

ధూమపానం చేసేవారు కరోనా బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. దీని ద్వారా శ్వాసకోశ సంబంధిత సమస్యలు తీవ్రమవుతాయని హెచ్చరించింది.

'న్యూరోలాజికల్ ఇన్​సైట్స్ ఆఫ్ కొవిడ్-19 పాండమిక్' పేరిట ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జోధ్​పుర్​కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఈ నివేదిక అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన అంతర్జాతీయ జర్నల్​లో ప్రచురితమైంది.

రుచి, వాసన చూసే లక్షణాలపై ప్రభావం..

వైరస్ బారిన పడిన వారు రుచి, వాసన చూసే లక్షణాలను కోల్పోతారని హెచ్చరించింది నివేదిక. అలాంటి లక్షణాలు గుర్తిస్తే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని.. ఇతరులకు సోకేందుకు కారకులు కాకముందే సంబంధిత నిపుణులను కలిసి చికిత్స తీసుకోవాలని సూచించింది. నిర్లక్ష్యం చేస్తే కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడులోని అంతర్లీన నిర్మాణాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించింది.

" హెచ్ ఏసీఈ2 అనే ఎంజైమ్ ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇదే ప్రాథమిక ప్రవేశ మార్గం. ఊపిరితిత్తుల నుంచి నాసికా శ్లేష్మం వరకు ఈ ఎంజైమ్ ఉంటుంది. కరోనా రోగుల్లో నాడీవ్యవస్థ ఇన్​ఫెక్షన్లు ధూమపానం వంటి వాటి ద్వారా తీవ్రమవుతాయి. మానవ గ్రాహకాలు (ఎంజైమ్), నికోటిన్ గ్రాహకాల మధ్య పరస్పర చర్యల వల్ల కొవిడ్-19 ఆధారిత న్యూరో ఇన్పెక్షన్లు సంక్రమించే అవకాశాలు పెరుగుతాయి. ఈ రెండు ఎంజైమ్​ల మధ్య సంబంధం ఉండటం వల్ల ధూమపానం చేసినప్పుడు.. నికోటిన్ కారణంగా హెచ్ ఓసీఈ2 ఎంజైమ్ ఉత్తేజితమవుతుంది. "

-సురజిత్ ఘోష్, ఐఐటీ జోధ్​పుర్​ ప్రొఫెసర్

అదనపు కారకంగా..

కరోనా సోకిన రోగుల మెదడుపై పరీక్షలు, సెరెబ్రోస్ఫానయల్ ద్రవం విశ్లేషణ ఆధారంగా పొగతాగేవారు, తాగనివారిపై పరిశోధన చేసినట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. కొవిడ్-19 రోగులలో వయస్సు, ఇప్పటికే ఉన్న అనారోగ్యాలతో పాటు ధూమపానం అదనపు ప్రమాద కారకంగా ఉంటోందని గుర్తించారు. కరోనా రోగులు వాసన, రుచి కోల్పోయేందుకు ముఖ్య కారణం ముక్కు, నోరు ఈ వైరస్​కు ముఖ్యమైన ప్రవేశ మార్గాలుగా ఉండటమేనని తెలిపారు పరిశోధకులు. వైరస్ అక్కడి నుంచి నెమ్మదిగా మెదడులోని ఘ్రాణ బల్బ్​లోకి నాడీ వ్యవస్థ ద్వారా చేరుతుందని చెప్పారు. ఈ ఘ్రాణ బల్బ్ అనేది వాసన చూసేందుకు ప్రధాన వ్యవస్థ అని వివరించారు.

ఇదీ చూడండి:కరోనా మృతుల్లో పురుషులే అధికం- ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details