మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా జన్మస్థానంపై కొద్ది రోజులుగా చెలరేగిన వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రజల డిమాండ్లను అంగీకరించినట్లు తెలిపారు ఆలయ ట్రస్ట్ ప్రతినిధి, భాజపా స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ పాటిల్.
సాయి జన్మస్థల వివాద పరిష్కారానికై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబయిలో.. సాయి సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ, పలువురు మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సమస్యపై సుదీర్ఘంగా చర్చించన నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. శిరిడీవాసుల డిమాండ్లను సీఎం అంగీకరించినట్లు ట్రస్ట్ నేతలు వెల్లడించారు.
" ఈ చర్చలో ఠాక్రే ప్రజల డిమాండ్లకు అంగీకరించి... మరో వివాదం తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి శిరిడి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. నేటితో ఈ వివాదానికి తెరపడినట్లే"
- రాధాకృష్ణ పాటిల్, ఆలయ ట్రస్ట్ ప్రతినిధి, స్థానిక భాజపా ఎమ్మెల్యే