తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండో హరిత విప్లవం మాతోనే సాధ్యం: రాహుల్​

రైతుల బతుకు చిత్రాన్ని మార్చేందుకు రెండో హరిత విప్లవం అనివార్యమని రాహుల్​ గాంధీ అభిప్రాయపడ్డారు. ఆ పని కాంగ్రెస్​ మాత్రమే చేయగలదని ధీమా వ్యక్తంచేశారు.

రెండో హరిత విప్లవం మాతోనే సాధ్యం: రాహుల్​

By

Published : Mar 23, 2019, 5:39 PM IST

"రైతులు, నిరుద్యోగులను ఎన్డీఏ సర్కారు విస్మరించింది".... కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పదేపదే చేసే విమర్శ. మరి కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఆ వర్గాల కోసం ఆయన ఏం చేస్తారు? ఎలాంటి కార్యక్రమాలు తీసుకొస్తారు? 'ఈనాడు' ముఖాముఖిలో ఈ ప్రశ్నలకు జవాబు చెప్పారు కాంగ్రెస్​ అధ్యక్షుడు.

అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తారు?

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. రోజుకు రూ.3.50 చొప్పున నగదు బదిలీ చేస్తే.. రైతులను సంక్షోభం నుంచి బయట పడేసినట్టా? వారిని చిన్నచూపు చూడడమే అవుతుంది. మోదీ ప్రభుత్వం అదే చేస్తోంది. దేశంలో 15 మంది బడా వ్యాపారుల కోసం రూ. 3.50లక్షల కోట్ల రుణాలు రద్దు చేస్తారు. మరి రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయరు? ధనికులకు ఒక నీతి, రైతులకో నీతా? మేం అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాం. రైతుల సమస్యల పరిష్కారానికి సాంకేతికతను పెంచాలి. అంతర్జాతీయ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి. వారి ఉత్పత్తులను నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి. తగినంత రుణం ఇవ్వాలి. దేశంలో రెండో హరిత విప్లవం అవసరం. రైతులకు ఆదాయం వచ్చేలా చూడాలి. వారి జీవితాల్లో సుస్థిరత అవసరం. ఇది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం.

నిరుద్యోగులపై మోదీ ప్రభుత్వ వైఖరెలా ఉంది?

నైపుణ్యాలను ప్రదర్శించేందుకు మన దేశ యువత సిద్ధంగా ఉంది. అవకాశాలు మాత్రం లేవు. నిరుద్యోగాన్ని ఓ సమస్యగా గుర్తించడానికి కూడా ప్రధాని సిద్ధంగా లేరు. సమస్యను గుర్తించనప్పుడు ఇంకేం పరిష్కారం చూపుతారు? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి... ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యలను తీరుస్తాం.

మరి ప్రభుత్వం వాదన వేరేలా ఉంది. నిరుద్యోగాన్ని పరిష్కరించామంటూ లెక్కలతో చెబుతోంది. ఏమంటారు?

లక్షల మంది యువతతో చర్చించిన తర్వాత వారి సమస్యలేంటో నాకు తెలిశాయి. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్లలో ఇప్పుడే ఎక్కువగా ఉంది. చైనా రోజుకు 50 వేల ఉద్యోగాలను కల్పిస్తుంటే... మనం రోజుకు 27 వేల ఉద్యోగాలను కోల్పోతున్నాం. 2017-18లోనే కోటి ఉద్యోగాలు కోల్పోయాం. నిరుద్యోగాన్ని జాతీయ అత్యవసర సమస్యగా ప్రకటించి, తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.

మోదీని హత్తుకున్న విషయం గురించి..?

అక్కసును అక్కసుతో జయించలేం. నన్ను ఎప్పుడూ దుర్భాషలాడుతూ, ఎగతాళిగా మాట్లాడుతున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెబుతున్నా. తద్వారా ఆయన ఓర్పు వహించడం నేర్పారు. ఏదో ఒకటి నేర్పుతున్న వారిని ఎలా ద్వేషించగలం? ఆయన పట్ల నాకు ద్వేషం లేదు. ఉన్నదల్లా ప్రేమే! అందుకే లోక్​సభలో ఆయనను హత్తుకున్నా.

ప్రియాంక రాక కాంగ్రెస్‌కు కలిసొస్తుందని భావిస్తున్నారా?

ప్రియాంకపై పూర్తి నమ్మకం ఉంది. అప్పగించిన బాధ్యతలన్నింటినీ ఆమె సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఆమె మంచి వక్త. మంచి శ్రోత. ప్రజలకు దగ్గరై కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తారు. పార్టీ మూల సిద్ధాంతాలను అర్థం చేసుకున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతున్నారు. ఆమె రాక... యూపీతో పాటు, దేశవ్యాప్తంగా మా కార్యకర్తలు, నాయకులకు ఉత్సాహాన్నిచ్చింది.

ఇదీ చూడండి :భారత్​ భేరి: శతాధిక బామ్మ 'ఓటు' పాఠాలు

ABOUT THE AUTHOR

...view details