ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండక తప్పదు. ఎన్ని రోజులు టీవీ చూస్తాం. ఎంత కాలం ఈ సోషల్ మీడియా! ఏదైనా కొత్తగా చేయాలి. అనే ఆలోచన మొదలైంది. అవును. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కబుర్లే. ఎవరి నోట విన్నా అవే ముచ్చట్లు. అంతలా ప్రపంచాన్ని గడగడలాడిస్తోందీ మహమ్మారి. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. మరైతే, ఈ సమయాన్ని ఖాళీగా వృథా చేసుకోకుండా ఎలా గడపాలి? పొదుపుగా ఎలా వాడుకోవాలి?..అనే ఆలోచనలు మీలో మొదలైతే.. ఈ ఛాలెంజ్‌లను ఆచరించండి! సమయం ఇట్టే గడిచిపోతుంది. కాదు కాదు.. గడిపేయొచ్చు.
వ్యాయామం తప్పనిసరి
అన్ని జిమ్‌లు, వర్కవుట్ సెంటర్‌లు తెరుచుకోవు. అందుకే ఇంట్లోనే వర్కవుట్స్ మొదలెట్టండి. అదీ క్రమం తప్పకుండా.. అందుకు ‘హోమ్ వర్కవుట్స్ ఛాలెంజ్’ ని ప్రయత్నించండి. పుష్ అప్స్, చిన్ అప్స్, చెయిర్ డిప్స్.. లాంటివి రోజుకు ఒక రకం ఎంచుకోండి. మీరు చేయడమే కాదు.. స్నేహితులకు ఛాలెంజ్ చేయండి. ఎలా వర్కవుట్స్ చేయాలో వీడియో క్లిప్‌లు పంపండి.
కథలు, కవితలు రాద్దాం..
కాలేజీల్లో రాసిన కవితలు.. పాడిన పాటలు.. అన్నీ గుర్తు తెచ్చుకోండి. ఎక్కడో మూల ఓ రచయిత మీలో ఉండే ఉంటాడు. పెన్ను, పేపర్ తీసుకుని ‘షార్ట్ స్టోరీస్’ రాయండి. లాక్‌డౌన్ ముగిసేలోపు ఓ కథల సంపుటే తయారవ్వొచ్ఛు ఇలా మీదైన శైలిలో ఏవైనా రాస్తే ‘కీప్ ఎ జర్నల్ ఛాలెంజ్’ విసరండి. మీకంటూ ఓ బ్లాగుని తెరవండి. దాంట్లో రాసిన వాటిని అందరితో పంచుకోండి. ఇతరుల్నీ రాసేలా ప్రేరేపించండి.
పరిశోధకులైపోదాం..
నాలుగు గోడలకే పరిమితం అవ్వడం అంటే.. ఓ సైంటిస్ట్‌లా మారిపోవడమే. మీకు ఇష్టమైన అంశాన్ని ఎంపిక చేసుకుని దానిపై పరిశోధించండి. ఉదాహరణకు మీకు సైన్స్ ఇష్టమైతే రానున్న కాలంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయో విశ్లేషించండి. దానిపై ఓ వ్యాసం రాయండి. ఎలాగూ.. అంతర్జాలం సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాయి. వెబ్ విహారం చేయండి.. ప్రియ మిత్రులకు ‘రీసెర్చ్ ఛాలెంజ్’ని విసరండి.
డిజిటల్ అక్షరాస్యత పెంచండి..
రానున్న కాలం మొత్తం డిజిటల్ యుగమే. మరైతే, మీ ఇంట్లో ఎంత మంది డిజిటల్ ఇండియాకి దగ్గరయ్యారు. గమనించి వారికి అంతర్జాలంపై అవగాహన కల్పించండి. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో తీసుకోవాల్సిన రక్షణ చిట్కాల్ని వివరించండి. సైబర్ క్రైమ్‌లోని చీకటి కోణాల్ని వివరించండి. సోషల్ మీడియాలోని నకిలీ మనుషులు, వారి నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని కళ్లకు కట్టినట్లు చెప్పండి. చుట్టూ ఉన్నవారికి కూడా ‘డిజిటల్ అక్షరాస్యత ఛాలెంజ్’ని విసరండి.