తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస కార్మికుల రైల్​ టికెట్​పై రాజకీయ రగడ - RAILWAY CHARGING FAIRS FOR MIGRANTS

రైలు ప్రయాణం కోసం వలస కూలీల నుంచి ఛార్జీలు వసూలు చేయడం ఏంటని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ప్రశ్నించారు. భారతీయ రైల్వే ఓవైపు ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తోందని తెలిపారు. రాహుల్​ ఆరోపణలపై స్పందించిన భాజపా.. 85శాతం రాయితీతో రైల్వే టికెట్లు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

Railway has subsidised 85 per cent fare for migrant workers: BJP
వలస కార్మికుల ప్రయాణంపై రాజకీయ రగడ

By

Published : May 4, 2020, 12:28 PM IST

దేశవ్యాప్తంగా వలస కార్మికుల తరలింపుపై రాజకీయ దుమారం రేగింది. వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఖర్చులు వసూలు చేయడంపై కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఆ ఛార్జీలను కూలీలు చెల్లించనవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని భాజపా స్పష్టంచేసింది. ఈ మేరకు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది.

'వసూలు చేస్తూ విరాళాలిస్తారా?'

కరోనా సంక్షోభంలో రైలు ప్రయాణం కోసం భారతీయ రైల్వే.. వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయడాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ తప్పుబట్టారు. కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి భారతీయ రైల్వే విరాళాలు ఇస్తోందని విమర్శించారు.

"ఓవైపు వలస కార్మికుల నుంచి టికెట్​ ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి రైల్వేశాఖ రూ.151కోట్లను విరాళంగా అందిస్తోంది. ఈ పజిల్​ను మీరే పరిష్కరించండి."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత

వలస కూలీల రైలు ఖర్చులను కాంగ్రెస్​ భరిస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన కొద్ది గంటల అనంతరం రాహుల్​ ఈ ట్వీట్​ చేశారు.

'మీరు ఇలాగే చేయండి...'

వలస కార్మికుల కోసం ఛార్జీల్లోని 85శాతాన్ని భారతీయ రైల్వే రాయితీగా అందిస్తోందని భాజపా పేర్కొంది. రైల్వే తీరును రాహుల్​ గాంధీ ప్రశ్నించిన నేపథ్యంలో భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా ఈ మేరకు వ్యాఖ్యానించారు. మిగిలిన 15శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని తెలిపారు.

వలస కూలీలకు రైలు టికెట్లను రాష్ట్ర ప్రభుత్వాలే కొనిపెట్టవచ్చని సంబిత్​ పాత్రా సూచించారు. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ఇలాగే చేస్తోందని.. దీనిని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు అనుసరించాలని పేర్కొన్నారు.

"రాహుల్​ జీ... ఏ స్టేషన్​లోనూ ఒక్క టికెట్​ కూడా అమ్మకూడదని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. 85శాతం రైల్వే రాయితీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు 15శాతం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాలే వలస కూలీలకు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్​ పాలిత ప్రాంతాలను అనుసరించమని చెప్పండి."

--- సంబిత్​ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి.

'టికెట్లు అమ్మట్లేదు..'

ఈ వ్యవహారంపై రైల్వేశాఖ స్పష్టతనిచ్చింది. టికెట్​ రేటులోని 15శాతం మాత్రమే వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. వలస కార్మికులకు టికెట్లు అమ్మడం లేదని.. ప్రభుత్వం అందిస్తున్న జాబితా ప్రకారమే వారిని రైళ్లలోకి ఎక్కించుకుంటున్నట్టు వెల్లడించింది.

సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ శ్రామిక్​ రైళ్లను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. రైలులో ప్రయాణిస్తున్న వారందరికీ తాగు నీరు, భోజనం ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. గమ్యస్థానాల నుంచి వెనక్కి వచ్చేడప్పుడు రైళ్లు ఖాళీగానే వస్తున్నాయని చెప్పింది.

ఇదీ చూడండి:-కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం

ABOUT THE AUTHOR

...view details