వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో మూడు రోజులుగా కాంగ్రెస్ నిర్వహిస్తోన్న ఆందోళన చివరి రోజు ఉద్రిక్తంగా మారింది. 'ఖేతీ బచావో' పేరుతో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ.. పంజాబ్ నుంచి హరియాణాలోకి ప్రవేశించే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొద్ది మంది కార్యకర్తలతో కలిసి రాహుల్‌ను అనుమతించడం వల్ల వివాదం సద్దుమణిగింది.
పంజాబ్‌లోని నూర్పుర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఈ ర్యాలీకి నాయకత్వం వహించారు.
తోపులాట..
కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హరియాణాలోకి ప్రవేశించేందుకు రాహుల్ యత్నించగా కొవిడ్ నిబంధనల మేరకు హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుగా ఉంచి వారు ముందుకు రాకుండా నిలువరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఎన్ని గంటలైనా..
పోలీసుల తీరును నిరసిస్తూ రాహుల్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అక్కడే ఆందోళన నిర్వహించారు. తాను అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఒక గంట, రెండు గంటలు కాదు అయిదు వేల గంటలైనా తాను అక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
అనంతరం కొవిడ్ నేపథ్యంలో వంద మంది కంటే తక్కువ మంది వస్తే అనుమతిస్తామని హరియాణా పోలీసులు స్పష్టం చేయగా అందుకు రాహుల్ అంగీకరించారు. కొద్ది మంది కార్యకర్తలతో కలిసి రాహుల్ హరియాణాలోకి ప్రవేశించగా వివాదం సద్దుమణిగింది.