ఐక్యతా విగ్రహం ఉన్న గుజరాత్లోని కేవడియా ప్రాంతంలో పర్యటకుల సంఖ్య పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవడియా ప్రాంతాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలతో కలిపే 8 రైళ్లకు ప్రధాని పచ్చజెండా ఊపి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసుల ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
''ఈరోజు ప్రారంభించిన రైలు సర్వీసుల్లో ఒకటి పురుచ్చి తలైవార్ డా.ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) మధ్య రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. ఈరోజే ఎంజీఆర్ జయంతి కావడం కాకతాళీయం. పేద ప్రజల సేవ కోసం ఎంజీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే పర్యటకులకు ఈ కనెక్టివిటీ.. ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవడియా గిరిజన తెగల జీవితాలను మార్చేందుకు దోహద పడుతుంది. వారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.''