2020లో ప్రసార భారతికి చెందిన డిజిటల్ ఛానెళ్లు.. 100శాతానికిపైగా వృద్ధిని సాధించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దూరదర్శన్, ఏఐఆర్(ఆల్ ఇండియా రేడియో) సేవలను అధికంగా ఉపయోగించుకున్న రెండో దేశంగా పాకిస్థాన్ నిలిచిందని పేర్కొంది.
గతేడాదిలో.. దూరదర్శన్, ఆకాశవాణి ఛానెళ్లు.. బిలియన్ డిజిటల్ వ్యూస్, 6 బిలియన్ డిజిటల్ వాచ్ మినిట్స్‌ను సంపాదించుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సేవలను అధికంగా ఉపయోగించుకున్న మొదటి దేశం భారత్ కాగా.. రెండు, మూడు స్థానాల్లో పాకిస్థాన్, అమెరికాలు ఉన్నట్టు స్పష్టం చేసింది.
ప్రసార భారతి మొబైల్ యాప్ "న్యూస్ ఆన్ ఎయిర్"కు 2020లో 2.5 మిలియన్ మంది యూజర్స్ పెరిగారు. మొత్తం మీద 300 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది ఈ యాప్.