ప్రజల్లో అవగాహన లేమి, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పార్టీల వ్యూహాలతో రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయని సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఎన్నికల్లో భారీ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హజారే అభిప్రాయపడ్డారు.
పార్టీలకు సంబంధించిన ఎన్నికల చిహ్నాలను తొలగించాలని 81ఏళ్ల హజారే డిమాండ్ చేశారు. ఈ చిహ్నాలు రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. రాజకీయం ప్రస్తుతం వేర్వేరు వర్గాల మధ్య పోటీలా తయారైందని, దేశంలో ఇదే అతిపెద్ద సమస్యని అభిప్రాయపడ్డారు హజారే. ఇలాంటి వర్గాలను రాజ్యాంగం ప్రోత్సహించదన్నారు.