ఆగస్టు 15లోగా 'ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన' కింద 2 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులనుఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్సీ) పథకంలో చేర్చుకోవాలని ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా ఉమ్మడి సేవా కేంద్రాలను నిర్వహిస్తోంది.
రైతుకు పింఛన్
'పీఎం-కేఎమ్వై'ని దిల్లీలో శుక్రవారం వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించారు. ఈ పథకం జమ్ముకశ్మీర్, లద్ధాఖ్లతో సహా దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ఫలితంగా ఆర్హులైన 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.3 వేలు పింఛను లభిస్తుంది.
పథకంలో చేరడం చాలా సులభం
అర్హత ఉన్న ఏ రైతు అయినా సమీపంలోని 'సీఎస్సీ'కి వెళ్లి... ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ లేదా ఖాతా వివరాలు సమర్పించి 'పీఎం-కేఎమ్వై' పథకంలో సులభంగా చేరవచ్చు.
'సీఎస్సీ'లను నిర్వహించే గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలు(వీఎల్ఈ) రైతుల వివరాలన్నీ తీసుకున్న తరువాత ఆన్లైన్లో నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు.
ప్రామాణీకరణ ప్రక్రియ పూర్తయిన తరువాత.. నమోదు చేసుకున్న రైతుకు సమాచారం అందిస్తారు. వారికి ప్రత్యేకమైన పింఛను ఖాతా సంఖ్యతో 'పీఎమ్-కేఎమ్వై' పెన్షన్‌కార్డు ఇస్తారు. 2019-20 బడ్జెట్లో ప్రకటించిన విధంగా, వీరికి నెలకు రూ.3 వేలు చొప్పున పింఛను అందుతుంది.
ఎవరు అర్హులు
రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు ఈ పథకంలో చేరవచ్చు. వయస్సును అనుసరించి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని ప్రభుత్వం కూడా ప్రీమియంగా చెల్లిస్తుంది.
ఈ పథకం రిజిస్ట్రేషన్ కోసం కామన్ సర్వీస్ సెంటర్లు వసూలు చేసే 30 రూపాయల ప్రవేశ రుసుమునూ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 60 ఏళ్ల కంటే ముందే రైతు మరణిస్తే అతని భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. 60 ఏళ్ల తరువాత రైతు మరణిస్తే అతని భార్యకు 50 శాతం పింఛను అందుతుంది.
ఇదీ చూడండి: చైనాతో చర్చలు : బీజింగ్‌లో జై శంకర్