తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీరికి ఓటు వేసే అవకాశం కల్పించలేమా?

ఓటరు జాబితాలో పేరుంది. ఓటు వేసి బాధ్యత నిర్వర్తించాలన్న ఆలోచన ఉంది. కానీ... ఓటు వేయలేని దుస్థితి. ఇందుకు కారణం... వృత్తిరీత్యా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉండడమే. దేశంలో ఇలాంటి వారు లక్షల మంది ఉన్నారు. వారు ఎప్పటికీ అంతేనా? ఓటేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించలేమా?

అవకాశం కోల్పోతున్న ఓటర్లు

By

Published : Apr 3, 2019, 8:52 AM IST

అవకాశం కోల్పోతున్న ఓటర్లు
లక్ష్మణ్​... ఓ సరుకు రవాణా నౌక కెప్టెన్. ఏడాదిలో అనేక నెలలు గడిపేది సముద్రంలోనే. సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ సమయానికీ ఉండేది నడిసంద్రంలోనే. మరి ఓటు వేయడం ఎలా?

లక్ష్మణ్​ ఒక్కడే కాదు. అలా నౌకల్లో పనిచేసే వారు దేశంలో 2 లక్షల మంది ఉన్నారని నౌక యజమానుల సంఘం-మస్సా చెబుతోంది. వారిలో ఎంతమందికి ఓటు వేసేందుకు వీలు చిక్కుతుంది?

ఈ ప్రశ్న నౌకాయాన రంగంలో ఉన్నవారికే పరిమితం కాదు. ఎక్కువ కాలంపాటు సొంతూరుకు దూరంగా ఉండాల్సి వచ్చే వృత్తుల్లో ఉన్నవారందరిదీ ఇదే కథ. వీరందరినీ పరిగణనలోకి తీసుకుంటే... ఓటు హక్కు ఉన్నా వేసేందుకు వీలు లేని వారి సంఖ్య చాలా ఎక్కువని అర్థమవుతోంది.

ప్రయాణ ఖర్చు

దేశంలో ఎక్కువ మంది ఓటర్లు మధ్య తరగతి ప్రజలే. దాదాపు 10 కోట్ల మంది పని కోసం అంతర్గతంగా వలస వెళ్తున్నారు. వీరిలో ఎన్నికల కోసం సొంత ఊర్లకు రావడానికి ప్రయాణ ఖర్చు విషయంలో వెనకాడే వారు అధికంగానే ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

పోలింగ్ శాతంలో గ్రామాలదే ఎప్పుడూ పైచేయి. రెండు దశాబ్దాలుగా పట్టణాలకు వలసలు వస్తున్నవారి శాతం పెరిగిపోతోంది. మున్ముందు గ్రామాల్లోనూ ఓటింగ్ శాతం పడిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఇదీ చూడండి:భారత్​ భేరి: రాజకీయ వినోదం @​ ట్విట్టర్​

విదేశాల్లోనే..

వృత్తి, చదువు కోసం భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన వారు కోట్లలో ఉన్నారు. 2018 డిసెంబర్​లో విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 4.4 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉన్నారు. వీరందరూ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లే.

మరికొందరు ప్రయాణికుల సేవల్లో ఉన్నవారు.. అంటే విమాన, నౌక సర్వీసుల్లో పనిచేసేవారు. ఈ-ఓటింగ్ ద్వారా ఓటు వేసే వీలు కల్పించాలని వారు కోరుతున్నారు.

జైళ్లలో బ్యాలెట్!

భారత జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారి సంఖ్య 4 లక్షల 18 వేలు. వారూ ఓటు వేసేలా అవకాశం కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. "నేరం చేసినా వారు భారత పౌరులే. వారికి హక్కు ఉంటుంది" అనేది కొందరి వాదన.

ప్రభుత్వాధికారులు, ఎన్నికల బాధ్యత నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అవకాశం ఉంది. అదే తరహాలో జైళ్లలోనూ ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.

ఎన్నో ప్రత్యామ్నాయాలు కానీ...

మొబైల్ లేదా అంతర్జాలం ద్వారా ఎక్కడ నుంచైనా ఓటు వేసేందుకు అవకాశం కల్పించటం ఓ ప్రత్యామ్నాయం. వన్ టైం పాస్ వర్డ్ లేదా ఆధార్ అనుసంధానంతో ఇది సాధ్యం. అన్నింటికన్నా సులువైన పద్ధతి. ప్రపంచంలో ఎక్కడున్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. హ్యాకర్ల ప్రభావంపై అనుమానాలు ఉన్నాయి.

విదేశాల్లో ఉన్నవారికి పాకిస్థాన్ ఈ సౌలభ్యం కల్పించింది. ఐ-ఓటింగ్ ద్వారా అక్కడి ప్రవాసీలు ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకుంటున్నారు.

ఇదీ చూడండి:భారత్​ భేరి: డబుల్​ ధమాకాపై డీఎంకే గురి

ఆన్​లైన్​ ఎన్నికల కేంద్రాలు

పోటీ పరీక్షలు ఆన్​లైన్​లో రాసినట్టే ఈ విధానం కూడా. చదువు, ఉద్యోగాల నిమిత్తం ఇతర పట్టణాలు, రాష్ట్రాలకు వెళ్లిన వారికోసం ఆన్​లైన్​ ఓటింగ్ కేంద్రాలు పెట్టాలి. అంతర్జాలంలో ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలి. అయితే నిర్వహణ ఖర్చు ఎక్కువ. సర్వర్లను ఉపయోగిస్తారు. కాబట్టి హ్యాకింగ్ భయాలు తప్పకుండా ఉంటాయి.

ప్రాక్సీ ఓటింగ్

ఓటరు అందుబాటులో లేనప్పుడు వారి తరఫున కుటుంబ సభ్యులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించేదే ప్రాక్సీ విధానం. అయితే... ఈ విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కొందరి వాదన. దుర్వినియోగం అయ్యే ప్రమాదమూ ఉంది.

పోస్టల్ ఓటింగ్

నియోజకవర్గం పరిధిలో ఓటరు లేనప్పుడు పోస్ట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించొచ్చు. దీనికి హ్యాకింగ్ సమస్య ఉండదు. అయితే ఇది ఎన్నికల సంఘానికి సమస్యగా మారుతుంది. నియోజకవర్గాలవారీగా బ్యాలెట్​ పత్రాలు వేరుచేసి లెక్కించటానికి ఎక్కువ రోజుల సమయం పడుతుంది.

దేశంలో ఓటింగ్ శాతం పెరగాలంటే ఎన్నికల విధానంలో ఎన్నో సంస్కరణలు అవసరం. వీటిలో ఏది సాధ్యమో తేల్చి, అమలు చేయడం ఎప్పటికి పూర్తవుతుందన్నది అసలు ప్రశ్న.

ఇదీ చూడండి:అప్పుడు ఎంపీ... ఇప్పుడు బీడీ కార్మికుడు

ABOUT THE AUTHOR

...view details