కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టినట్లు ప్రకటించుకున్న పతంజలి తాజాగా వెనకడుగు వేసింది. 'కరోనిల్'ను కేవలం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికే తయారు చేసినట్లు ప్రకటించింది. కొవిడ్-19కు ఔషధంగా చెప్పలేదని పేర్కొంది.
"మా సంస్థ రోగనిరోధకత పెంచే డ్రగ్స్ కోసమే లైసెన్సులు తీసుకుంది. 'దివ్య స్వసరి వతి', 'దివ్య కొరోనిల్ ట్యాబ్లెట్', 'దివ్య అను తైల్'.. ఇవన్నీ రోగనిరోధక శక్తినిచ్చే మందు(ఇమ్యునిటీ బూస్టర్)లకు ప్రత్యామ్నాయాలే. క్లినికల్ పరీక్షలను మరోసారి నిర్వహించడానికీ మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎలాంటి తప్పుడు వాదనలు చేయలేదు. మా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు."
-బాలకృష్ణ, పతంజలి సీఈఓ
మరోవైపు.. తాము ఎలాంటి కరోనా కిట్లను తయారు చేయడం లేదని పతంజలి స్పష్టం చేసింది.
పరీక్షలకు నమూనాలు..
ఈ విషయంపై స్పందించిన ఉత్తరాఖండ్ ఆయుర్వేద శాఖ లైసెన్స్ అధికారి వైఎస్ రావత్... 'కొరోనిల్' ప్యాకేట్లపై కరోనా వైరస్ను పోలి ఉన్న చిత్రాన్ని పతంజలి ముద్రించిందని పేర్కొన్నారు.