'ముందు ఎన్పీఆర్పై ప్రజల భయాలను పోగొట్టండి' జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జనగణనపై ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయని పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది. వచ్చే నెలలో మొదలయ్యే ఈ రెండు ప్రక్రియలపై దేశ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి.. వారిని ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది.
కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2020-21 ఎన్పీఆర్, జనగణన కోసం ఆధార్ మెటాడేటాను తీసుకునే అవకాశాలను పరిశీలించాలని కోరింది. ఈ మేరకు రాజ్యసభకు ఇచ్చిన నివేదికలో కమిటీ పేర్కొంది.
"వచ్చే నెలలో మొదలయ్యే ఎన్పీఆర్ ప్రక్రియపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పూర్తి ఆమోదం తెలపాలని మేము భావిస్తున్నాం. ఇందుకు జాతీయ ఆమోదం కావాలి. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ దీనిపై అవగాహన ఉండాలి. అప్పుడే ఈ ప్రక్రియ సులభతరంగా జరగడానికి అవకాశం ఉంది." - పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ
2021 జనగణన, ఎన్పీఆర్ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో వీటిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కమిటీ అభిప్రాయపడింది. హోంమంత్రిత్వశాఖ ఎన్పీఆర్లో కొత్తగా చేర్చిన పరామితులు, ప్రశ్నలపై రాష్ట్రాలను సమర్థించారా లేదా అనే ప్రశ్నలను కమిటీ లేవనెత్తింది.
2021 జనగణనలో బయోమెట్రిక్ గుర్తింపు తీసుకునే ప్రతిపాదన లేదని కమిటీ అడిగిన ఓ ప్రశ్నకు హోంమంత్రిత్వశాఖ సమాధానమిచ్చింది. అలానే చరిత్రలో తొలిసారి జనగణన డిజిటల్ విధానంలో జరుగుతుందని పేర్కొంది.