పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద ముఠాలు భారత్‌లో దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కశ్మీర్ అంశంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి లోయలోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా దళాలే లక్ష్యంగా దాడులు జరిపే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి. కశ్మీర్లో నిర్బంధ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని నమ్మించి.. ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ముష్కురులు కుట్ర పన్నుతున్నట్టు తెలిపాయి.
పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు దాడులకు కుట్ర పన్నుతున్నట్లు కీలక సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. శ్రీనగర్‌లోని జొనకర్, రాయినావరి, సఫకదల్, ధర్మశాల్ వంటి ప్రాంతాలను ఉగ్రవాదులు తమ లక్ష్యంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. శ్రీనగర్‌లో ఇటీవలే భద్రతా బలగాలపై గ్రనైడ్ దాడులు సహా అధికారులపై ముష్కరులు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి ఇటువంటి చర్యలకు ఉగ్రవాదులు పాల్పడవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.