కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ 25కు పైగా దేశాలకు వ్యాపించింది. మన దేశంలోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. ఈ వైరస్ సోకిన ముగ్గురు విద్యార్థులు వుహాన్ విశ్వవిద్యాలయానికి చెందినవారే. ఈ నేపథ్యంలో కేరళ-వుహాన్‌ల సంబంధాలపై అందరి దృష్టి పడింది. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయానికి కేరళకు ఉన్న సంబంధమేమిటీ అనే ప్రశ్నం అందిరిలోనూ ఉత్పన్నమవుతోంది.
వైద్య విద్య కోసం
కేరళలోని చాలా మంది విద్యార్థులు చైనాలో... ముఖ్యంగా వుహాన్‌లో విద్యనభ్యసించడానికి మొగ్గుచూపుతున్నారు. వైద్య విద్యకు వుహాన్ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. అత్యుత్తమ సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, అందుబాటు ఫీజుతో నాణ్యమైన వైద్య విద్య అందించటమే ఇందుకు కారణం. దీంతో చైనాలోని వుహాన్ యునివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో చేరడానికి పెద్ద సంఖ్యలో కేరళ విద్యార్థులు తరలివెళ్తున్నారు.
"వుహాన్ విశ్వవిద్యాలయంలోని వైద్య విద్యావ్యవస్థ పట్ల సంతోషంగా ఉంది. వారు సరసమైన ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు."
-వుహాన్ నుంచి తిరిగి వచ్చిన కేరళ విద్యార్థి
ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు వుహాన్ విశ్వవిద్యాలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని మరో విద్యార్థిని ఐశ్వర్య హరిహరన్ తెలిపారు. కళాశాలకు సెలవులు కావడం వల్ల జనవరి మొదట్లోనే ఆమె వుహాన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు.
"వుహాన్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య బోధిస్తారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశీ విద్యార్థులకు తరగతులు ఆంగ్లంలో బోధిస్తారు. మా బ్యాచ్‌లో 70 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. అందులో 50 మంది కేరళకు చెందినవారే."
-ఐశ్వర్య హరిహరన్, వుహాన్‌లోని కేరళ విద్యార్థి
తక్కువ ఫీజుతో అంతర్జాతీయ ప్రమాణాలు లభిస్తుండడం వల్ల తల్లితండ్రులు సైతం తమ పిల్లలను వుహాన్‌కు పంపేందుకు సిద్ధమవుతున్నారు.