కట్టెల పొయ్యి వాడని ఏకైక గ్రామం 'బాన్చా' ఉత్తరప్రదేశ్‌లోని బెతుల్ మున్సిపాలిటీలోని బాన్చా గ్రామం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో ఉన్న 75 ఇళ్ల వారు ఆహారాన్ని వండటానికి సౌర విద్యుత్తుతో పని చేసే ఎలక్ట్రిక్ స్టవ్‌లను వినియోగిస్తున్నారు. ఫలితంగా దేశంలోనే మొదటి కట్టెల పొయ్యి రహిత గ్రామంగా అవతరించి అరుదైన ఘనత సాధించింది బాన్చా.
సౌర విద్యుత్తు ఫలకాల వినియోగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శన బాన్చా గ్రామస్థులను ప్రత్యామ్నాయ మార్గంలో నడిచేలా చేసింది. ఆ ప్రదర్శనలో ఐఐటీ ముంబయి, ఎన్ఐటీ కురుక్షేత్ర విద్యాలయాలు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచాయి.
ఎన్ఐటీ కురుక్షేత్ర విద్యార్థులు సౌర ఫలకాల ద్వారా విద్యుత్తును బ్యాటరీల్లో నిలవ చేసే విధానాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ బాన్చా గ్రామస్థులను ఆకర్షించింది. ఆ బ్యాటరీలను తమ గ్రామంలో ఏర్పాటు చేయాలని సంకల్పించిన గ్రామస్థులు ఐఐటీ విద్యార్థుల సాయాన్ని అర్థించారు.
గతంలో అడవికి వెళ్లి వంట కలప తీసుకొచ్చేవాళ్లం. కట్టెల పొయ్యి మీద అన్నం వండితే అది మంచిగా ఉండడం లేదు. ఇప్పుడు 30, 40 నిమిషాల్లోనే ఆహారం సిద్ధమవుతోంది. చాలా సమయం ఆదా అవుతోంది.
- గ్రామస్థుడు
విద్యార్థుల సూచనలతో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన బాన్చా గ్రామస్థులు.. తమ గ్రామంలో సౌర ఫలకాల ఏర్పాటుకు మార్గం సుగుమం చేసుకున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు బాన్చా గ్రామంలో సౌర ఫలకాల ఏర్పాటును పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఐఐటీ విద్యార్థులు సౌర విద్యుత్తు వినియోగంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. సౌర ఫలకాల ఏర్పాటు, ఎలక్ట్రిక్ స్టవ్‌లను ఎలా ఉపయోగించాలో వివరించారు. ప్రతి ఇంట్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకున్న బాన్చా గ్రామస్థులు.. వంటతో పాటు గృహావసరాలకూ సౌర విద్యుత్తును ఉపయోగించుకుంటున్నారు.
గతంలో వంట చెరుకు కోసం అడవుల్లోకి వెళ్లి చాలా కష్ట పడేవాళ్లమని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయిందని బాన్చా గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌర ఫలకాల వినియోగం వల్ల ఆహారమూ సమయానికి సిద్ధమవుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
''సౌర ఫలకాల వినియోగం మాకు చాలా ప్రయోజనకరంగా ఉంది. ఎండలో కట్టెల కోసం అడవికి వెళ్లాల్సిన శ్రమ తప్పింది. ఇప్పుడు కట్టెల కోసం అడవికి వెళ్లే శ్రమ లేదు. అన్నం కూడా సమయానికి సిద్ధమవుతోంది. ఇంతకుముందు ఇళ్లంతా నల్లగా తయారయ్యేది. ఇప్పుడు ఆ బాధ లేదు. ''
- గ్రామస్థురాలు