తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''పౌర' చట్టంపై ఆందోళన వద్దు.. సంయమనం పాటించండి' - ''పౌర' చట్టంపై హింసాత్మక ఘటనలు దురదృష్టకరం'

పౌరసత్వ చట్టంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

citizenship law
నరేంద్ర మోదీ

By

Published : Dec 16, 2019, 3:02 PM IST

పౌరసత్వ చట్ట సవరణ విషయంలో భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చట్ట సవరణకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. అవి తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

మోదీ ట్వీట్​

ఆస్తుల ధ్వంసం సరికాదు

ప్రజాస్వామ్యంలో చర్చలు, అసమ్మతి కీలకమన్నారు మోదీ. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజాజీవితానికి ఆటంకాలు కలిగించడం సరికాదని పేర్కొన్నారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును.. పార్లమెంటు ఉభయసభలు భారీ మెజార్టీతో ఆమోదించాయని గుర్తుచేశారు. చాలా రాజకీయ పార్టీలు, ఎంపీలు మద్దతు పలికారని తెలిపారు.

మోదీ ట్వీట్​

సంయమనం పాటించాలి

ఈ చట్టం శతాబ్దాల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మత సామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు మోదీ. ఎన్నో ఏళ్లుగా ఇతర దేశాల్లో ఇబ్బందులు పడిన వారిని ఆదుకునేందుకు మాత్రమే ఈ చట్టం తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని.. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధి, పేదల అభ్యున్నతి కోసం అంతా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు ప్రధాని.

మోదీ ట్వీట్​

ఇదీ చూడండి:'ఆ సామర్థ్యం మాకుంటే మీరు అధికారంలో ఉండేవారు కాదు'

ABOUT THE AUTHOR

...view details