నిర్భయ దోషి 'మైనర్' పిటిషన్ కొట్టివేత- ఉరే తరువాయి నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్ అంటూ దోషి పనన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై దిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని జస్టిస్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఫలితంగా పవన్‌తో పాటు మరో ముగ్గురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలుకానుంది.
2012 డిసెంబర్లో నేరం జరిగిన సమయంలో పవన్ గుప్తా వయస్సు 17 ఏళ్ల ఒక నెల 20 రోజులని వాదించారు అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్. ఇదే విషయంపై దిల్లీ హైకోర్టు, ట్రయల్ కోర్టును ఆశ్రయించినా... అతడి పిటిషన్‌ను పొరపాటున కొట్టివేసిందని నివేదించారు. ఈ కేసులో అతడ్ని మైనర్‌గానే పరిగణించి, శిక్ష విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.
దిల్లీ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్త. ప్రతీ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దోషి మైనర్ కాదని తేల్చినట్టు తెలిపారు. ఘటన సమయంలో పవన్ వయస్సు 19 అని.. ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయని తెలిపారు. ఇప్పుడు తీర్పును మారిస్తే న్యాయాన్ని అవహేళన చేసినట్టేనని స్పష్టం చేశారు.
జడ్జి అసహనం...
దోషి తరఫు న్యాయవాది వాదనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ అసహనం వ్యక్తం చేశారు. మైనర్ వాదనకు సంబంధించి 2018 జులై 9న పవన్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఏదో కొత్త సమాచారంతో వచ్చి, పిటిషన్‌ను విచారించమంటే ఎలా అని ప్రశ్నించారు. చివరకు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ జరిగింది...
2012 డిసెంబరు 16 రాత్రి 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్ కావడం వల్ల మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి రాంసింగ్ తిహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని 2019 జులై 9న కొట్టివేసింది.
ఈ నెల 22న నలుగురు దోషులను ఉరి తీయాలని దిల్లీకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఒక దోషి రాష్ట్రపతికి క్షమాభిక్షకు అర్జీ పెట్టుకోవడం వల్ల ఉరి ఆలస్యమైంది. చివరికి నలుగురిని ఫిబ్రవరి 1న ఉరి తీయనున్నారు.
ఇదీ చూడండి:- 'నాకు రాజకీయాలొద్దు.. నిర్భయ దోషులకు శిక్ష కావాలి'