వలస జీవులపై కరోనా ప్రభావం అంతా ఇంతా కాదు. లాక్డౌన్తో ఉన్న చోట ఉండలేక.. సొంత ఊళ్లకు వెళ్లలేక ఎంతో సతమతమవుతున్నారు వలస కార్మికులు. ఈ క్రమంలో కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే దేశ రాజధాని దిల్లీలో జరిగింది. రెండు ట్రక్కుల్లో దాక్కుని వెళ్తున్న దాదాపు 100మంది వలస కూలీలను పట్టుకున్నారు దిల్లీ పోలీసులు. వారిని అక్రమంగా రవాణా చేస్తున్న లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది...
దిల్లీలోని ఆర్కే పురం, ఓక్లా ఫేస్-1లో ఉంటున్న వలస కూలీలు.. బిహార్లోని సొంత ఇళ్లకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. రెండు లారీల్లో బయలు దేరారు. అక్రమ రవాణా కోసం వలస కార్మికుల నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు లారీ యజమానులు.