తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో చక్రం తిప్పనున్న ఎన్సీపీ?

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో.. ఎన్సీపీకీ పెద్ద పీఠ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్​ పవార్​ ప్రమాణ స్వీకారం చేయగా.. మరిన్ని కీలక శాఖలు ఆ పార్టీ నేతలకే కట్టబెట్టనున్నట్లు సమాచారం.

ncp
ఎన్సీపీకీ కీలకపదవులు

By

Published : Jan 3, 2020, 3:39 PM IST

సిద్ధాంత పరంగా వైరుద్ధ్యాలున్న శివసేన, కాంగ్రెస్‌లను ఏకతాటిపైకి తెచ్చి మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ).. మంత్రివర్గ కేటాయింపుల్లో జాక్‌పాట్‌ కొట్టినట్లు కన్పిస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా కీలక మంత్రిత్వశాఖల్లో చాలా వరకు ఆ పార్టీకే దక్కినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

హోం, ఆర్థిక, ఇరిగేషన్‌, హౌసింగ్‌ మంత్రిత్వ బాధ్యతలను ఎన్సీపీ మంత్రులు చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్సీపీ నేతలు అనిల్‌ దేశ్‌ముఖ్‌కు హోంశాఖ, దిలీప్‌ వాల్సేకు కార్మిక, ఎక్సైజ్‌ శాఖ, జితేంద్ర అహ్వద్‌కు హౌసింగ్‌ శాఖ, ధనుంజయ్‌ ముండేకు సామాజిక న్యాయ శాఖలను కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు ఆర్థిక బాధ్యతలూ అప్పజెప్పనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. సంఖ్యా పరంగానూ ఎన్సీపీ నుంచే ఎక్కువ మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం విదితమే. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎన్సీపీ నుంచి 12 మంది కేబినెట్‌ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు.

కాంగ్రెస్​కు దక్కిన శాఖలు!

మరో మిత్ర పక్షమైన కాంగ్రెస్‌కు రెవెన్యూ శాఖ దక్కినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్‌ థోరాట్‌కు రెవెన్యూ, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు పీడబ్ల్యూడీ, వర్ష గైక్వాడ్‌కు వైద్య విద్య శాఖలు కేటాయించినట్లు సమాచారం. అయితే వ్యవసాయ శాఖ కావాలని కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

మరోవైపు శాసనసభలో తొలిసారి అడుగుపెట్టి కేబినెట్‌ బెర్త్‌ దక్కించుకున్న శివసేన యువనేత, సీఎం కుమారుడు ఆదిత్య ఠాక్రేకు పర్యావరణ శాఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రస్తుతం జనరల్‌ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తుండగా.. ఆయన అదనపు శాఖలేవీ తీసుకోబోరని సమాచరం. మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇదీ చూడండి:మోదీజీ.. ప్రతిసారీ పాకిస్థాన్​తో పోలికేంటి: మమత

ABOUT THE AUTHOR

...view details