తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2019, 4:09 PM IST

ETV Bharat / bharat

దేశమంతా హై అలర్ట్​.. కశ్మీర్​కు మరిన్ని బలగాలు

అధికరణ 370, 35ఏలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్​ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కశ్మీర్​కు అదనంగా మరో 8 వేల మంది పారామిలటరీ దళాలను తరలిస్తోంది.

దేశవ్యాప్తంగా హై అలర్ట్​.. కశ్మీర్​కు అదనపు బలగాలు

దేశవ్యాప్తంగా హై అలర్ట్​.. కశ్మీర్​కు అదనపు బలగాలు

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్​ 370, ప్రత్యేక హక్కులు ఇస్తున్న ఆర్టికల్​ 35ఏను రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం.

దేశవ్యాప్తంగా హై అలర్ట్​...

ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్​ ప్రకటించింది కేంద్ర హోంశాఖ. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్​లు, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. వారివారి పరిధిలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీర్​ ప్రజలు, విద్యార్థులకు భద్రత కల్పించాలని ఆదేశించింది.

సైన్యం, వాయుసేన అప్రమత్తం...

అధికరణ 370, 35ఏ రద్దు నిర్ణయానంతరం సైన్యం, వాయుసేనలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

కశ్మీర్​కు మరిన్ని బలగాలు...

కశ్మీర్​లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బలగాల మోహరింపును మరింత పెంచింది కేంద్రం. తాజా నిర్ణయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు చేపట్టింది. ఉత్తర్​ప్రదేశ్​, ఒడిశా, అసోం సహా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి పారామిలటరీ దళాలకు చెందిన 8 వేల మందిని కశ్మీర్​కు వాయుమార్గంలో పంపింది.

ప్రస్తుతం కశ్మీర్​లో అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి చిన్న ఘటనకు తావు లేకుండా పహారా కాస్తున్నాయి బలగాలు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు రాష్ట్రం మొత్తం సైనిక స్థావరంగా మారిపోయింది.

ABOUT THE AUTHOR

...view details