తెలంగాణ

telangana

ఆమె శవాలకు సేవలు చేస్తుంది.. కాటికి కాపలాకాస్తుంది!

By

Published : Mar 8, 2020, 11:05 AM IST

'అమ్మో నాకు భయం.. వామ్మో అది పురుషులు చేసే పని నేనెలా చేస్తా? ఆడవారు సున్నితంగా ఉండాలి మగరాయుడులా అన్ని పనులూ చేయలేరు' అని తమను తాము తక్కువ అంచనా వేసుకునే అతివలకు.. కొండంత ధైర్యాన్ని పంచుతోంది మధ్యప్రదేశ్​​కు చెందిన మున్నీబాయి. పురుషులకు దీటుగా శ్మశానంలో కాటికాపరిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. నారీశక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.

munni
ఆమె శవాలకు సేవలు చేస్తుంది.. కాటికి కాపలాకాస్తుంది!

ఆమె శవాలకు సేవలు చేస్తుంది.. కాటికి కాపలాకాస్తుంది!

మధ్యప్రదేశ్​ నర్సింగ్​పుర్​కు చెందిన మున్నీబాయి(65) శ్మశానంలో ఒంటరిగా నివాసం ఉంటోంది. చితి మంటల వెలుగులోనే భోంచేస్తుంది. చితాభస్మం ఎగిరిపడే గాలిని పీలుస్తుంది. పుర్రెలు పగిలే ధ్వనుల మధ్యే నిద్రిస్తుంది. అయినా.. ఆమె కళ్లలో ఇసుమంతైనా భయం కనిపించదు. ఆత్మ విశ్వాసం మాత్రమే ఉంటుంది . అందుకే తెగువగల కాటికాపరిగా గుర్తింపు తెచ్చుకుంది.

గౌరవంగా సంపాదిస్తూ..

మున్నీ భర్త ఏనాడో చనిపోయాడు. కూలీనాలీ చేస్తూ ఒంటరిగానే జీవించడం అలవాటు చేసుకుంది. ఓ పైపు పేదరికం వెక్కిరిస్తున్నా.. కష్టాల కొరడా ఝలిపిస్తున్నా.. ఆత్మాభిమానాన్ని వీడలేదు మున్నీ. భిక్షాటనకు సిద్ధపడలేదు. మామ గరీబ్​దాస్​, అత్త కౌసల్యల కాటికాపరి వృత్తిలోనే తానూ స్థిరపడాలనుకుంది. మూడేళ్ల క్రితం మహిళా కాటికాపరిగా బాధ్యతలు చేపట్టింది.

శవాలకు సేవలు చేసేందుకు ఏనాడూ సిగ్గు పడలేదు మున్నీ. ఆత్మలు పీక్కుతింటాయని భయపడలేదు. అత్తమామలు నేర్పిన పనిని గౌరవంగా నిర్వర్తిస్తూ.. జీవనం సాగిస్తోంది.

"నేను ఇంత చేస్తున్నా.. అలసిపోను. ఇది నా పని నేనే చేయాలి కదా. అందులో భయమెందుకు? ఈ శ్మశానమంతా తిరుగుతాను. నేను, ఎవ్వరి దగ్గరా ఒక్క రూపాయి కూడా యాచించను. నేను దొంగతనం చేయడం లేదు. పని చేస్తున్నాను. ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇస్తారు. వారు 10 రూపాయలు ఇచ్చినా చాలు."

-మున్నీ బాయి.

శ్మశాన సేవలోనే..

జీవితంలో ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదు.. ఏదో ఓ రోజు అందరూ శ్మశానవాటికకు రావాల్సినవారే కదా.. అందుకే ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కాటికాపరిగానే పనిచేస్తూ పుణ్యం సంపాందించుకుంటానంటోంది మున్నీ.

"నేను 24 గంటలు ఇక్కడే ఉంటాను. శవాన్ని దహనం చేశాక నాకు పనులు మొదలవుతాయి. ఇక్కడే తింటాను. ఇక్కడంతా బాగానే ఉంది. సేవ చేస్తూ పుణ్యం మూటగట్టుకుంటున్నాను."

-మున్నీ బాయి.

శభాష్​!

మున్నీ ఆత్మస్థైర్యాన్ని చూసి స్థానికులంతా సలాం చేస్తున్నారు. స్త్రీలు తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని ప్రశంసిస్తున్నారు.

"ఈ బామ్మ, ఇక్కడే పని చేస్తోంది. అంత్యక్రియల సమయంలో ఈ స్థలాన్ని పేడతో అలికి, శుభ్రం చేస్తుంది. ఈ పని చేయడానికి ఆమెకు ఎలాంటి సిగ్గు, సంకోచం లేదు. మహిళలు ముందుకొచ్చి ధైర్యంగా ఇలాంటి పనులు చేయడం చూస్తూంటే మాకు గర్వంగా ఉంది. ఇదొక అరుదైన ఉదాహరణ."

-కిషన్​ గుప్తా, స్థానికుడు

తరాలు ఎన్ని మారినా.. జీవితంలో వచ్చే చిన్నిచిన్ని ఒడుదొడుకులకే హైరానా పడిపోయి.. మహళగా పుట్టడమే తాను చేసిన తప్పుగా భావించి కుంగిపోయే వారికి ఇప్పటికీ కొదవలేదు. కానీ, ​మున్నీబామ్మ గుండె ధైర్యాన్ని చూస్తే మాత్రం.. లోపం పుట్టుకలో కాదు, మనలోని శక్తిని గుర్తించడంలోనే అనిపిస్తోంది కదూ?

ఇదీ చదవండి:ప్రొఫైల్ చూసి ప్రేమించింది.. దివ్యాంగుడైనా పెళ్లాడింది

ABOUT THE AUTHOR

...view details