నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష మరింత ఆలస్యమవుతోంది. వీరి మరణ దండనకు నూతన డెత్ వారెంట్లను జారీ చేయాలని దిల్లీ ప్రభుత్వం, నిర్భయ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను సోమవారానికి వాయిదా వేసింది దిల్లీ కోర్టు. అతని వైపు నుంచి న్యాయ ప్రక్రియ ఆలస్యమవుతోందని అసహనం వ్యక్తం చేసింది. జిల్లా న్యాయసేవల అధికారులు సిఫారసు చేసిన న్యాయవాదులను పవన్ గుప్తా తిరస్కరించినందు వల్ల అతని తరఫున న్యాయవాదిని నియమించింది కోర్టు.
సుప్రీం తీర్పు రేపు..
మరోవైపు నిర్భయ కేసులో దోషులకు వేర్వేరుగా మరణదండన విధించేందుకు అనుమతించాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో రేపటిలోగా దోషులు తమ స్పందన తెలియచేయాలని ఆదేశించింది. దిల్లీ ట్రయల్ కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం పిటిషన్‌పై విచారణను రేపు చేపట్టనున్నట్లు తెలిపింది.
దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తరఫున కోర్టుకు సహకారం అందించేందుకు సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాశ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది సర్వోన్నత న్యాయస్థానం.