తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు గ్రామీణ ప్రాపర్టీ కార్డుల పంపిణీ ప్రారంభించనున్న మోదీ

గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించేందుకు తీసుకొచ్చిన స్వామిత్వ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రాపర్టీ కార్డులను ఇవాళ అందజేయనున్నారు. ఆరు రాష్ట్రాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.

PM Modi
ప్రధాని నరేంద్రమోదీ

By

Published : Oct 11, 2020, 5:16 AM IST

'స్వామిత్వ' పథకం కింద 'ప్రాపర్టీ కార్డు'ల అందజేత కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కార్యక్రమంలో భాగంగా కొందరు లబ్ధిదారులతో మోదీ మాట్లాడనున్నట్లు తెలిపింది.

దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో నివ‌సిస్తున్న కోట్లాది మంది పౌరులకు ఈ పథకం సాధికార‌త క‌ల్పించనుందని ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది. గ్రామస్థులు వారి భూములను ఆర్థిక ఆస్తులుగా పరిగణించి రుణాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేసింది.

ఎస్​ఎంఎస్​ ద్వారా..

ఈ కార్యక్రమం ద్వారా సుమారు ల‌క్ష మంది లబ్ధిదారులు వారి ప్రాపర్టీ కార్డుల‌ను ఎస్ఎమ్ఎస్ లింక్ ద్వారా డౌన్​లోడ్ చేసుకొనేందుకు అవ‌కాశం ల‌భించ‌నుంది. అనంతరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాపర్టీ కార్డుల‌ను ద‌స్తావేజుల రూపంలో అంద‌జేస్తాయి. ఈ ప‌థ‌కం ల‌బ్ధిదారుల్లో ఆరు రాష్ట్రాల‌లోని 763 గ్రామాల ప్రజలు ఉన్నారు.

ఇందులో ఉత్తర్​ప్రదేశ్, హ‌రియాణా, మ‌హారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్​, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర మిన‌హా రాష్ట్రాల ల‌బ్ధిదారులు ఒకే రోజులో ఈ ద‌స్తావేజుల‌ను అందుకోనున్నారు. మ‌హారాష్ట్రలో ప్రాప‌ర్టీ కార్డుదారు వ‌ద్ద నుంచి నామ‌మాత్ర ఖ‌ర్చును రాబ‌ట్టుకొనే వ్యవస్థ కార‌ణంగా దీనికి ఒక నెల రోజుల సమయం ప‌డుతుంది.

'స్వామిత్వ' పథకం..

'స్వామిత్వ' అనేది కేంద్ర పంచాయతీరాజ్​ శాఖ అధీనంలోని పథకం. దీనిని ఈ ఏడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయ‌తీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించారు. గ్రామీణ కుటుంబ య‌జ‌మానుల‌కు 'హ‌క్కుల రికార్డు'తో పాటు ప్రాప‌ర్టీ కార్డుల‌ను జారీ చేయాల‌న్న ల‌క్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ ప‌థ‌కాన్ని నాలుగేళ్ల కాలంలో ద‌శ‌ల వారీగా దేశ‌మంత‌టా అమ‌లు చేయ‌నున్నారు. 2024 వరకు దేశంలోని దాదాపుగా 6.62 లక్షల గ్రామాల్లో ప్రాప‌ర్టీ కార్డుల‌ను అందజేస్తారు. ప్రస్తుతం పైలట్​ ప్రాజెక్టు కింద ఈ ఆరు రాష్ట్రాల్లో పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల‌లో డ్రోన్ స‌ర్వే నిమిత్తం 'స‌ర్వే ఆఫ్ ఇండియా'తో అవ‌గాహ‌న ఒప్పందాన్ని కుదుర్చుకునన్నాయి ఆయా రాష్ట్రాలు.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ మనసు గెలుచుకున్న చిన్నారి పాట

ABOUT THE AUTHOR

...view details