వారణాసిలో మోదీపై పోటీ చేసేది ఎందరు? వారణాసి.. ఇప్పుడు దేశమంతటి చూపు ఈ స్థానంపైనే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండడం ఓ కారణమైతే.. ఈ సారి ఆయనపై ఎంత మంది పోటీ చేస్తారనేది మరో ఆసక్తికరాంశం. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తారనే వాదనలు బలం పుంజుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి తండ్రి, 111 మంది తమిళ రైతులు, భీమ్ ఆర్మీ అధినేత, ఓ మాజీ జవాను కూడా వారణాసి బరిలో నిలుస్తామంటున్నారు.
పోటీ రసవత్తరం
"నేను వారణాసి నుంచి పోటీ చేయనా?"... ఇది వారణాసి ప్రజలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అడిగిన ప్రశ్న. ఆ మాటతో ఆమె మోదీతో తలపడేందుకు సిద్ధమయ్యారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
"ప్రధానమంత్రి వారణాసిలోని గ్రామాల్లోకి వస్తున్నారా అంటే... ఐదేళ్లలో ఆయన సొంత నియోజకవర్గంలో ఒక్క గ్రామానికీ రాలేదు. ఒక్క కుటుంబాన్నీ కలవలేదు. ఒక్కరి బాగోగులూ చూడలేదు. ఇంత పెద్దస్థాయిలో ప్రచారం చేసుకుంటున్న ప్రధాని సొంత నియోజకవర్గంలో ఎంతో కొంత చేశారని అనుకున్నాను. తన సొంత నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకునేందుకు ప్రధానికి సమయం లేదు. మరి దేశంలోని పేదలు, రైతులు, పేద మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ప్రియాంక గాంధీ వారణాసి బరిలో నిలిస్తే మోదీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రియాంక పూర్తిస్థాయిలో ఉత్తర్‌ప్రదేశ్‌పైనే దృష్టి పెట్టడం ఇందుకు ప్రధాన కారణం. అందునా గాంధీ కుటుంబానికి ఉత్తర్‌ప్రదేశ్ కలిసొచ్చిన రాష్ట్రం.
ఇదీ చూడండి:భారత్ భేరి: మహారాష్ట్రలో రెండు స్తంభాలాట
పోటీకి తమిళ రైతులు సై
దిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసనలతో యావద్దేశం దృష్టిని ఆకర్షించారు తమిళ రైతులు. ఇప్పుడు మరోమారు అలాంటి కార్యక్రమానికి సిద్ధమయ్యారు.
"మా పంటలకు మద్దతు ధర కావాలని 141 రోజులపాటు దిల్లీలో ఉద్యమించాం. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పొన్ రాధకృష్ణన్ మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన హామీని నెరవేర్చలేదు. భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు మద్దతు ధర ప్రకటించకపోతే మోదీ పోటీ చేసే స్థానంలో మేము 111 మంది నామినేషన్ వేస్తాం."
-అయ్యకన్ను, తమిళ రైతు సంఘం అధ్యక్షుడు
ఇదీ చూడండి:కేరళ వయనాడ్ నుంచి రాహుల్ పోటీ
సీఎం తండ్రి పోటీకి సిద్ధం
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నంద్ కుమార్ బఘేల్ కూడా వారణాసిలో మోదీపై పోటీకి సిద్ధమంటూ ప్రకటన చేశారు.
"కాంగ్రెస్ టికెట్ ఇస్తే వారణాసిలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. నియంతను ఓడిస్తా."
-- నంద్ కుమార్ బఘేల్
మోదీ స్థానంలో అడ్వాణీ, మురశీ మనోహర్ జోషి, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ పోటీ చేస్తే తన నిర్ణయం మార్చుకుంటానని అన్నారు నంద్ కుమార్. అయితే, ఆయనకు రాజకీయ అనుభవం లేదు.
ఇదీ చూడండి:"కాంగ్రెస్‌ను దేశ వ్యతిరేకిగా చిత్రీకరిస్తారా?"
బరిలోకి భీమ్ ఆర్మీ
వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా కదం తొక్కుతోంది భీమ్ ఆర్మీ. ప్రధానిపై పోటీకి సిద్ధమయ్యారు భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్.
"మోదీపై వారణాసిలో పోటీ చేసేందుకు నాకు ఎస్పీ-బీఎస్పీ మద్దతివ్వాలి. లేకపోతే అగ్రనేతలైన ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, మాయావతిల్లో ఒకరు పోటీ చేయాలి. కూటమికి మేం 79 లోక్‌స్థానాల్లో మద్దతిస్తున్నాం. వారు ఈ ఒక్క చోట మాకు మద్దతివ్వాలని కోరుతున్నాం. వారణాసి నుంచి మోదీ మరోసారి గెలవకూడదని కోరుకుంటున్నాం."
-- చంద్రశేఖర్ ఆజాద్, భీమ్ ఆర్మీ అధినేత
ఇదీ చూడండి:'కాంగ్రెస్ 'న్యాయ్'ను ఎదుర్కొనేదెలా?'
చౌకీదార్‌పై పోటీకి మాజీ జవాను సిద్ధం
మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్. జవాన్లకు అందించే ఆహారం నాసిరకంగా ఉందంటూ 2017 జనవరిలో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఆయన. ఆ వీడియో అప్పట్లో సంచనలంగా మారింది. కొద్దికాలం తర్వాత ఆయన్ను విధుల్లో నుంచి తొలిగించింది బీఎస్ఎఫ్.
"జవాన్ల పేరు చెప్పుకొని మోదీ ఓట్లు అడుగుతున్నారు. కానీ ఆయన సైనికుల కోసం చేసిందేమీ లేదు. నేను గెలుపోటముల కోసం పోటీ చేయడం లేదు. సమస్యను వెలుగులోకి తెచ్చేందుకే పోరాడుతున్నా."
-- తేజ్ బహదూర్ యాదవ్, బీఎస్ఎఫ్ మాజీ జవాను
ప్రధానిపై పోటీ చేసేందుకు ఒక్కొక్కరిదీ ఒక్కో కారణం. వీరిలో ఎంతమంది మోదీకి నిజమైన పోటీ ఇవ్వగలరన్నదే ప్రశ్న.
ఇదీ చూడండి:భారత్ భేరి : మోదీకి జై... యడ్డీకి నై...!