తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాషాయ ప్రభంజనం... మరోసారి మోదీకే పట్టం

హోరాహోరీ పోటీ ఇస్తాయనుకున్న విపక్షాలు.. మరోసారి నమో ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. మెరుపుదాడులు అటు దాయాది పాకిస్థాన్​ను ఎంతగా భయపెట్టాయో... ఇటు భారత విపక్షాలను అదే రీతిలో బెంబేలెత్తించాయి. ఈ మెరుపుదాడులు, నమో హవాలో రఫేల్​ విమర్శలు, నిరుద్యోగం, నోట్​బందీ విమర్శలు తేలిపోయాయి. కాషాయ ప్రభంజనంతో... మరోసారి మోదీ ప్రధానిగా పట్టాభిషిక్తులు కానున్నారు.

కాషాయ ప్రభంజనం... మరోసారి మోదీకే పట్టం

By

Published : May 23, 2019, 8:32 PM IST

ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు, ఎన్డీఏ నాయకుల వ్యాఖ్యలు, మోదీ మాటలే నిజమయ్యాయి. 'ఫిర్​ ఏక్​ బార్​ మోదీ సర్కార్' నినాదం ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయింది. సార్వత్రిక ఫలితాల్లో ఇది స్పష్టంగా తేటతెల్లమయింది. వరుసగా రెండోసారి దేశ ప్రజలు భాజపాకు అఖండ విజయాన్ని అందించారు. ఎవరి సాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్పష్టమైన ఆధిక్యాన్ని కాషాయదళానికి కట్టబెట్టారు.

2014లో సాధించిన విజయాన్ని మైమరిపిస్తూ.. కాషాయ జెండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఎన్డీఏ 300 మార్కు దాటి పరుగులు పెడుతోంది. ఈ స్థాయిలో విజయం సాధించిన జనాకర్షక నేతగా నరేంద్ర మోదీ పేరు చరిత్రలో నిలిచిపోనుంది.

వారణాసిలో నమో- గాంధీనగర్​లో దళపతి

వారణాసి నుంచి బరిలోకి దిగిన ప్రధాని మోదీ 4.3 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా గుజరాత్​ గాంధీనగర్​ స్థానం నుంచి 5.5 లక్షల ఓట్లతో విజయబావుటా ఎగురవేశారు.

మోదీ ట్వీట్​...

అఖండ విజయాన్ని అందించిన అశేష భారతావనికి ప్రధాని ట్విట్టర్​లో కృతజ్ఞతలు తెలిపారు. "అందరితో+ అందరికి అభివృద్ధి+ అందరి ఆత్మావిశ్వాసం= భారతావని గెలుపు" అని ట్వీట్​ చేశారు.

భాజపా కేంద్రకార్యాలయంలో...

కేంద్ర భాజపా కార్యాలయంలో ఇంతటి ఘన విజయాన్ని అందించిన మోదీకి భాజపా కృతజ్ఞతలు తెలిపింది. ప్రధానికి అభినందనలు వెల్లువెత్తాయి.

తీర్పును గౌరవించిన కాంగ్రెస్​....

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించారు. భాజపా, నరేంద్ర మోదీకి దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడొద్దని కోరారు.

ఓటమి వైఫల్యాలపై చర్చించడానికి ఇది సరైన సమయం కాదని రాహుల్​ అభిప్రాయపడ్డారు.

ఎటు చూసినా కాషాయమే...

భాజపాకు ఆయువుపట్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్​, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్​ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలను భాజపా పునరావృతం చేసింది. ఊహించని రీతిలో బంగాల్​, ఒడిశాలోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది కాషాయదళం. దిల్లీలో కాషాయ పార్టీ ముందు ఆమ్​ఆద్మీ తేలిపోయింది. మరోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా పట్టాభిషక్తులు కావడమే తరువాయి.

ఇదీ చూడండి:

రాహుల్​కు ఝలక్​- చరిత్ర సృష్టించిన స్మృతి

ABOUT THE AUTHOR

...view details