తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2020, 6:59 PM IST

ETV Bharat / bharat

మోదీ ప్రతిపాదనకు సార్క్ దేశాల విశేష స్పందన

కరోనాను కట్టడి చేయడానికి సార్క్​ దేశాలు కలసికట్టుగా పనిచేయాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనపై పలు దేశాలు స్పందించాయి. సభ్యదేశాలు సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలన్న అంశంపై శ్రీలంక, భూటాన్, మాల్దీవులు, నేపాల్ దేశాలు తమ సంసిద్ధత వ్యక్తం చేశాయి. ప్రధాని చొరవను కొనియాడాయి.

Modi bats for joint SAARC
మోదీ సార్క్

కరోనాపై ఐకమత్యంగా పోరాడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుపై సార్క్ దేశాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మోదీ ప్రతిపాదనను సార్క్ దేశాలు స్వాగతించాయి. కరోనా కట్టడికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలన్న మోదీ నిర్ణయంపై భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్​ దేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. మోదీ తీసుకున్న నిర్ణయం నాయకత్వ ధోరణికి నిదర్శనమని కొనియాడాయి.

భారత ప్రధాని ప్రతిపాదనను శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వాగతించారు. తమ అభిప్రాయాలు పంచుకోవడానికి శ్రీలంక సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

"ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు నరేంద్రమోదీకి ధన్యవాదాలు. చర్చలకు శ్రీలంక సిద్ధంగా ఉంది. ఇతర సార్క్ దేశాల నుంచి నేర్చుకోవడమే కాకుండా మాకు తెలిసిన విషయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక్కటై మన పౌరులను క్షేమంగా ఉంచాలి."-గొటబాయ రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు

నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఒలీ సైతం ప్రధాని ప్రతిపాదనను కొనియాడారు. నేపాల్ ప్రభుత్వం సార్క్ సభ్య దేశాలతో పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

"కరోనా వైరస్​పై పోరాడటానికి బలమైన వ్యూహాన్ని రూపొందించిన ప్రధాని మోదీజీ ఆలోచనను స్వాగతిస్తున్నాను. ఈ వ్యాధి నుంచి మన పౌరులను రక్షించడానికి సార్క్ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి నేపాల్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది."-కేపీ ఓలీ, నేపాల్ ప్రధానమంత్రి

మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్.. మోదీ ప్రతిపాదనపై సుముఖత వ్యక్తం చేశారు. వైరస్ పోరాటంలో ప్రాంతీయ ప్రయత్నాలకు పూర్తిగా మద్దతిస్తామని పేర్కొన్నారు.

"ఈ అంటువ్యాధిపై చొరవ తీసుకున్నందుకు మోదీకి ధన్యవాదాలు. కొవిడ్-19ను ఓడించడానికి సంయుక్త ప్రయత్నం అవసరం. మాల్దీవులు ఈ ప్రతిపాదనను స్వాగతిస్తోంది. దీనికి పూర్తిగా మద్దతు ఇస్తాం."-ఇబ్రహీం మహ్మద్ సోలిహ్, మాల్దీవులు అధ్యక్షుడు

భూటాన్ ప్రధాని లొటాయ్​ షేరింగ్​ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని ప్రయత్నాన్ని అసలైన నాయకత్వంగా అభివర్ణించారు.

"ఇది అసలైన నాయకత్వం. ఇలాంటి సమయంలో ప్రాంతీయ కూటమి సభ్యదేశాలుగా మనమంతా ఒక్కతాటిపైకి రావాలి. చిన్న ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుచేత మనం సహకారం అందించుకోవాలి. మీ నాయకత్వంలో సత్వర, ప్రభావవంతమైన ఫలితాలు వస్తాయన్న విషయంలో సందేహం లేదు. వీడియో కాన్ఫరెన్స్​ కోసం ఎదురుచూస్తున్నా."-లొటాయ్ షేరింగ్, భూటాన్ ప్రధాని

ప్రధాని పిలుపు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. ఈ మహమ్మారిని అరికట్టేందుకు సార్క్ దేశాధినేతలుకలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సార్క్ దేశాలు వీడియో కాన్ఫరెన్స్​​ ద్వారా చర్చించాలని సూచించారు.

ప్రపంచ దేశాలకు వివరణ

మరోవైపు కరోనాను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ దేశాలతో భారత్ తన అభిప్రాయాలు పంచుకుంటోంది. 100 మంది రాయబారులు సహా 130 దేశాలకు చెందిన ప్రతినిధులకు భారత్​లో వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. పలు అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:220 రోజుల తర్వాత ఫరూఖ్​ అబ్దుల్లాకు 'స్వేచ్ఛ'

ABOUT THE AUTHOR

...view details