పెట్టుబడుల ఆకర్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ సాధించిన విజయాలను, మహాత్మాగాంధీ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన చేపడుతున్నారు. నేటి నుంచి వారం రోజులపాటు (21 నుంచి 27 వరకు) హ్యూస్టన్, న్యూయార్క్ల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
మోదీ పర్యటన పూర్తి వివరాలు:ప్రధాని మోదీ అగ్రరాజ్య పర్యటన సాగనుందిలా..
భారత్ ప్రాధాన్యత..
గత 50 ఏళ్లలో ప్రపంచ పరిస్థితులు విపరీతంగా మారిన నేపథ్యంలో భారత ప్రాధాన్యం పెరిగిందని చాటిచెప్పడం కూడా మోదీ పర్యటనలో అంతర్లీనంగా ఉన్న ఆశయం. ఐక్యరాజ్యసమితిని సంస్కరించి అందులో భారత్కు కీలక స్థానం లభించేలా చేయడమే ప్రధాని లక్ష్యంగా కనిపిస్తోంది.
"భారత్ అవకాశాల నేల, విశ్వసనీయ భాగస్వామి. విశ్వనేత అని విశ్వాసం కలిగించేలా నా పర్యటన ఉంటుంది. అమెరికాతో ఉన్న సంబంధాలకు నా పర్యటన కొత్త శక్తిని ఇస్తుందని ఆశిస్తున్నా. రెండు ప్రజాస్వామిక దేశాల మధ్య వారధిలా నిలిచిన భారత సంతతి ప్రజలు, అమెరికాకు వారు అందిస్తున్న సేవలు మనందరికీ గర్వకారణం. కలిసి పనిచేయడం ద్వారా సురక్షిత, సుసంపన్న ప్రపంచాన్ని నిర్మించగలమని విశ్వసిస్తున్నా."
- అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మోదీ ప్రకటన