మోదీ మాయాజాలం.. అమిత్‌షా వ్యూహరచన.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏను అమేయ శక్తిగా మార్చి భారీ మెజార్టీతో అధికార పీఠంపై కూర్చోబెట్టాయి. మోదీ 2.0 సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తయింది. దశాబ్దాలుగా భాజపా ప్రణాళికలో ఉన్న పెద్ద సవాళ్లనే పరిష్కరించింది మోదీ 2.0 సర్కారు.
ఆర్టికల్ 370 రద్దు నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం వరకు అన్నీ చారిత్రక విజయాలే. అయితే పౌరసత్వ చట్ట సవరణ వంటి నిర్ణయాలు దేశంలో నిరసన జ్వాలలకు కారణమయ్యాయి. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించే వరకు ఇవి కొనసాగాయి.
మోదీ 2.0 వార్షికోత్సవం సందర్భంగా సర్కారు తీసుకున్న చారిత్రక నిర్ణయాలు, ఇచ్చిన కీలక వాగ్దానాలు చూద్దాం...
2019 ఆగస్ట్ 5:జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.
రైతుల ఆదాయం రెట్టింపు...
ఇది మోదీ 2.0 సర్కారు ఇచ్చిన కీలక వాగ్దానం. 'వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు' 2016లో ఈ లక్ష్య సాధన కోసం ఓ నివేదికను తీసుకువచ్చింది. 2017లో నీతి ఆయోగ్ తన సొంత నివేదికతో ముందుకెళ్లింది.
పీఎం కిసాన్ (ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్నిధి) పథకం ద్వారా దాదాపు 8.2 కోట్ల మంది రైతులకు మొదటి దఫాగా రూ.62,469 కోట్లు అందాయి.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా...
2030 కల్లా భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని మోదీ సర్కారు వాగ్దానం చేసింది. దీని ప్రకారం 2025 కల్లా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికం, 2032 కల్లా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలి.
అయితే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ 2019లో భారత వృద్ధి రేటును 6.1% అంచనా నుంచి 4.8 శాతానికి తగ్గించింది. బ్యాంకింగేతర ఆర్థిక రంగం పతనమవుతున్నట్లు పేర్కొంది.
యూఏపీఏ చట్టం...
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లును (యూఏపీఏ) తీసుకువచ్చింది మోదీ 2.0 సర్కారు. ఈ బిల్లుకు 2019లో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.
ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. వారిపై ప్రయాణ నిషేధం విధించవచ్చు. అయితే ఈ చట్ట సవరణను విపక్షాలు అమానుషమని అభివర్ణించాయి.
ముమ్మారు తలాక్...
2019 ఆగస్ట్ 1: ముమ్మారు తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు ఏకకాలంలో మూడుసార్లు తలాక్ చెప్పడం క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అలా చెప్పిన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
కేవలం త్రిపుల్ తలాక్నే కాకుండా ముస్లిం సమాజంలో ఉన్న బహుభార్యత్వం విధానం సహా పలు అంశాలను రూపుమాపుతూ అందిరికీ ఒకటే చట్టం తీసుకురావాలని మోదీ 2.0 సర్కారు యోచిస్తోంది.
రామ మందిరం...
2019 నవంబర్ 9:దశాబ్దాల వివాదానికి తెరదించుతూ అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది.
అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణం చేసుకోవచ్చని సుప్రీం తెలిపింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ తీర్పుతో ఎన్నో దశాబ్దాలుగా భాజపా ప్రణాళికలో ఉన్న అతిపెద్ద వాగ్దానం నెరవేరినట్లయింది.