ముంబయిలో వలస కార్మికులు మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తీవ్ర ఉద్రిక్తతలకు, లాఠీఛార్జికి దారితీసిన ఈ ఘటన కుట్రపూరితంగా జరిగిందన్న కోణంలో మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నారు. వలస కార్మికులను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ టీవీ జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు.
పోస్ట్‌లో ఏముంది?
మహారాష్ట్ర ప్రభుత్వం వలసదారులకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు నవీ ముంబయికి చెందిన వినయ్ దూబే. లాక్‌డౌన్ కారణంగా కార్మికులంతా ఇక్కడే చిక్కుకుపోయారని, వారంతా తమ స్వస్థలాలకు వెళ్లాలని కోరుతున్నట్లు సందేశాన్ని జోడించాడు. ఏప్రిల్ 18 నాటికి రైళ్లు ఏర్పాటు చేయకపోతే జాతీయ స్థాయిలో నిరసన చేపట్టబోతున్నట్లు ట్వీట్ చేశాడు.