కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ ఈనెల 14న ముగియనుంది. అనంతరం సేవలు పునరుద్ధరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై భారతీయ రైల్వే కసరత్తు ప్రారంభించింది. రైళ్లలో భౌతిక దూరం పాటించటం నుంచి.. మాస్కులు ధరించటం, థర్మల్ స్క్రీనింగ్, ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్య యాప్ వినియోగించటం వరకు చేపట్టాల్సిన కార్యకలాపాల కోసం పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.
అయితే.. ప్రయాణికుల సర్వీసులు ఎప్పుడు ప్రారంభిస్తారు అనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత దశలవారీగా సేవలు పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఏవిధంగా సేవలు ప్రారంభించాలనే విషయంపై వచ్చే వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
" ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం కోసం చూడకూడదు. ప్రయాణికుల భద్రతపైనే దృష్టిసారించాలి. కరోనా వైరస్ వ్యాప్తి చెందదని భరోసా కల్పించాలి. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత రైళ్లు ఆయా సమయాల్లో నడుస్తాయి. అయితే.. ప్రస్తుతానికి మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జోన్ల పరిధిలోనూ ప్రారంభించాల్సిన మార్గాలు, రైళ్లను అధికారులు గుర్తించారు. లాక్డౌన్ ఏ విధంగా ఎత్తివేస్తారనే అంశంపై ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. ఎంపిక చేసిన ప్రాంతలవారీగా లాక్డౌన్ ఎత్తివేస్తే.. అదే క్రమంలో రైళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. "
- సీనియర్ అధికారి, రైల్వే శాఖ.