బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పునరుద్ఘాటించింది కేంద్ర హోంశాఖ. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికన్నా ఎక్కువ మంది సమావేశం కాకూడదని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ. పరిశ్రమల్లో వయసుపైబడిన వారు, చిన్న పిల్లలు ఉన్నవారిని ఇంటి నుంచే పని చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. పని ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ల వినియోగం తప్పనిసరిగా ఉండాలన్నారు.
941 కేసులు..
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో గత 24 గంటల్లో 941 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 37 మంది మరణించినట్లు తెలిపింది. కరోనా నుంచి ఇప్పటి వరకు మొత్తం 1489 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. దేశవ్యాప్తంగా 12,380 కేసులు నమోదయ్యాయని.. 414 మరణించారని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2,90,401 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఏప్రిల్ 15న ఒక్క రోజే 30,043 పరీక్షలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. వలస కూలీలకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా 325 జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు అగర్వాల్. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైద్య పరికరాల ఉత్పత్తిపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'రాహుల్.. మీ సీఎంలు ముందే అలా ఎందుకు చేశారు?'