బంగాల్లో లోక్సభ తుదిదశ ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించటంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టికల్ 324ను బంగాల్లో అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార సమయాన్ని తగ్గించటం అనైతిక చర్యని దుయ్యబట్టారు. ఈసీ అనైతికంగా మోదీకిచ్చిన బహుమతని ఆరోపించారు. మొత్తం ఆరెస్సెస్ కార్యకర్తలతో నిండిన ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఇంతకముందెన్నడూ చూడలేదని విమర్శించారు దీదీ.
'బంగాల్లో 324 ఈసీ మోదీకిచ్చిన బహుమతి' - పశ్చిమ బంగ
ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మమతా బెనర్జీ. ఈసీ బంగాల్లో ఆర్టికల్ 324ను అమలు చేసి మోదీకి బహుమానంగా ఇచ్చిందని విమర్శించారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.
"ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత అంతా మీ అధీనంలోనే ఉంటుంది, నిజమే. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మాత్రం ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం ఉంటుంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని మీరు అధీనంలోకి తీసుకోలేరు ఎన్నికల కమిషనర్ గారూ. గుర్తుంచుకోండి."
- మమతా బెనర్జీ, పశ్చిమబంగ ముఖ్యమంత్రి
బంగాల్లో ఎన్నికల ప్రచారం సమయాన్ని కుదించింది కేంద్ర ఎన్నికల సంఘం. కోల్కతాలో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగాల్లో ఎన్నికలు జరగాల్సిన 9 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనూ గురువారం రాత్రి 10 గంటలకే ప్రచారం ముగియనుంది.