రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న వేళ కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సెషన్లోనే తన ప్రభుత్వ బలం నిరూపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు ముఖ్యమంత్రి కుమారస్వామి.
కర్ణాటకీయం లైవ్: సుప్రీం స్టే- బలపరీక్షకు స్వామి సై - BJP
13:27 July 12
బలపరీక్షకు స్వామి సై...
13:03 July 12
మంగళవారం వరకు స్టే
రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మంగళవారం వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టంచేసింది. అప్పటివరకు రాజీనామాలు, అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోరాదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై మంగళవారం విచారణ కొనసాగిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు.
12:54 July 12
సుప్రీంలో వాడీవేడి వాదనలు
తమ రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు వేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
రెబల్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. "స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే రాజీనామాలపై నిర్ణయం తీసుకోలేదు. రెబల్స్ పార్టీ విప్ ధిక్కరించేలా చేయాలన్నదే ఆయన ఆలోచన" అని వాదించారు రోహత్గీ.
సుప్రీం ప్రశ్న...
ఈ క్రమంలో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు.... "రాజీనామాల ఆమోదంపై తమ తీర్పును సవాలు చేసే అధికారం స్పీకర్‌కు ఉందా?" అని సభాపతి రమేశ్ కుమార్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
రాజ్యాంగబద్ధమే...
స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. స్పీకర్ వైఖరిని సమర్థిస్తూ కొన్ని నిబంధనలు ప్రస్తావించారు. ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తుచేశారు.
గడువు ఇవ్వండి...
రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు ఒకటి-రెండు రోజులు గడువు ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును కోరారు. అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని విన్నవించారు.
అలా ఎలా..?
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అధికార పక్షం చేసిన అభ్యర్థనలపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు అధికారం ఉందని సింఘ్వీ వాదించారు. రెబల్స్ పిటిషన్‌పై స్పీకర్‌కు నోటీసులు ఇవ్వకుండా.... రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడంపై అభ్యంతరం తెలిపారు.
ఇదే సమయంలో... కుమారస్వామి తరఫు న్యాయవాది జోక్యం చేసుకున్నారు. వ్యాజ్యంలో ఎమ్మెల్యేలు తనపై అవినీతి ఆరోపణలు చేసినా... కోర్టు తనకు నోటీసులు ఇవ్వకపోవడంపై సీఎం అభ్యంతరం తెలిపారు. రెబల్స్ వేసిన వ్యాజ్యాన్ని అసలు విచారించి ఉండరాదని అభిప్రాయపడ్డారు. రాజీనామాలు స్వచ్ఛందంగా చేశారో లేదో నిర్ధరించుకుని, నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని వాదించారు స్వామి తరఫు న్యాయవాది.
12:20 July 12
కూటమి తరఫున సింఘ్వీ
కూటమి తరఫున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వెనుక ఉన్న ఉద్దేశం వేరని నివేదించారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే వారు రాజీనామా చేశారని వాదించారు.
12:17 July 12
విచారణ ప్రారంభం
కర్ణాటక వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. రెబల్ ఎమ్మెల్యేల తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.
11:54 July 12
కర్'నాటకం': సుప్రీంలో వాడీవేడి వాదనలు
కొద్ది రోజులుగా సాగుతున్న కర్ణాటక రాజకీయ సంక్షోభం.. ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. కన్నడ రసవత్తర రాజకీయం ఇప్పుడు సుప్రీం కోర్టు ముంగిట ఉంది. రాజీనామాల్ని ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.
రాజీనామాలు ఆమోదించేందుకు మరికొంత సమయం కావాలని.. కర్ణాటక అసెంబ్లీ సభాపతి దాఖలు చేసిన వ్యాజ్యంపైనా నేడే విచారణ జరపనుంది అత్యున్నత న్యాయస్థానం. ఈ రెండు అంశాలపై వాదనలు జరగనున్నాయి.
ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం.. అసంతృప్తి ఎమ్మెల్యేలు బెంగళూరులో స్పీకర్‌ను కలిసి రాజీనామాలు తిరిగి సమర్పించారు. వీటిని స్వీకరించిన సభాపతి.. నిర్ధరించడానికి సమయం పడుతుందని పేర్కొన్నారు.