తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​యూలో నిశ్శబ్దం- దేశవ్యాప్తంగా కదం తొక్కిన విద్యార్థి లోకం - దిల్లీ జేఎన్​యూలో ఉద్రిక్తత

నిన్న విద్యార్థులపై దాడితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దిల్లీ జేఎన్​యూ నేడు నిశ్శబ్దంగా మారింది. ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. జేఎన్​యూ తాజా పరిస్థితులపై దిల్లీ లెఫ్టి​నెంట్​ గవర్నర్​తో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చర్చించారు. విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరపాలని ఆదేశించారు.

jnu-violence
జేఎన్​యూలో నిశ్శబ్దం- దేశవ్యాప్తంగా కదం తొక్కిన విద్యార్థి లోకం

By

Published : Jan 6, 2020, 6:35 PM IST

Updated : Jan 6, 2020, 8:14 PM IST

జేఎన్​యూలో నిశ్శబ్దం- దేశవ్యాప్తంగా కదం తొక్కిన విద్యార్థి లోకం

దేశ రాజధాని దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం-జేఎన్‌యూలో అల్లర్ల వ్యవహారం దేశవ్యాప్త దుమారానికి దారితీసింది. రాజకీయ పక్షాలు పరస్పరం మాటల దాడులకు దిగగా.. వేర్వేరు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. జేఎన్​యూ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్రం. తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. లెఫ్టినెంట్​ గవర్నర్​తో చర్చలు జరిపారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరారు. అటు మానవవనరుల మంత్రిత్వశాఖ... విశ్వవిద్యాలయం అధికార యంత్రాంగంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

ముమ్మర దర్యాప్తు...

జేఎన్​యూలోకి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా చొరబడి విద్యార్థులపై దాడి చేసి.. ఆస్తులను ధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. కేసును క్రైం బ్రాంచ్​కు అప్పగించారు. నిన్న దాడిలో గాయపడిన 34 మంది నేడు ఎయిమ్స్​ నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. తలకు గాయమైన నలుగురిలో జేఎన్​యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్​ ఉన్నారు.

జేఎన్‌యూ ప్రాంగణంలో భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. గుర్తింపు కార్డులు ఉన్న విద్యార్థుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బయటి వ్యక్తులు, మీడియా ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు.

కదం తొక్కిన విద్యార్థి లోకం...

నిన్న జరిగిన దాడికి నిరసనగా ముంబయి, దిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ముంబయిలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ వద్ద సోమవారం ఉదయం వరకు ధర్నా కొనసాగడం గమనార్హం. అర్ధరాత్రి వరకు దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. దుండగుల్ని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఖండించిన రాజకీయ నేతలు...

క్యాంపస్‌లో హింసాత్మక ఘటనల్ని పలువురు రాజకీయ నేతలు ఖండించారు. ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందిస్తూ.. తాజా దాడి దేశంలో పెరిగిపోతున్న అసహనానికి నిదర్శనమన్నారు. దేశంలో అశాంతి, హింసను సృష్టించాలనుకుంటున్న వారే చేశారని దుయ్యబట్టారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్విట్టర్‌ వేదికగా దాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే న్యాయవిచారణ జరిపించాలని కోరారు.

దిల్లీ ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై సీఎం కేజ్రీవాల్‌ నేతృత్వంలో మంత్రి మండలి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.

వీసీ తొలగింపునకు డిమాండ్​...

విద్యార్థులపై దాడి నేపథ్యంలో ఉపకులపతిని తొలగించాలని జేఎన్​యూటీఏ (జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయ సంఘం) డిమాండ్​ చేసింది. మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరింది.

ఏం జరిగింది..?

ఆదివారం రాత్రి కొందరు ఆగంతుకులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. ముసుగులు ధరించి కర్రలు, ఇనుప రాడ్లు, సుత్తులు వంటివాటితో విరుచుకుపడ్డారు. వసతి గృహాల్లోని అద్దాలు, ఫర్నీచర్‌, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ సహా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడింది మీరంటే మీరంటూ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

ఇదీ చూడండి: సోషల్​ మీడియాకు కొత్త రూల్స్​- కేంద్రం, ట్విట్టర్​కు హైకోర్టు నోటీసులు

Last Updated : Jan 6, 2020, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details