తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2019, 2:27 PM IST

Updated : Oct 27, 2019, 3:14 PM IST

ETV Bharat / bharat

10 నెలల్లో 10 సీట్లతో డిప్యూటీ సీఎం అయ్యారు!

దుష్యంత్‌ చౌతాలా... ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. పార్టీ స్థాపించి ఏడాది తిరగక ముందే ఊహించని రీతిలో సత్తా చాటారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు. అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాతో చేతులు కలిపి.. నేడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు దుష్యంత్​.

10 నెలల్లో 10 సీట్లతో డిప్యూటీ సీఎం అయ్యారు

పార్టీ స్థాపించి 10 నెలలే అయింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది 10 స్థానాలే. అయినా... ఆ పార్టీ ఎంతో కీలకమైంది. అధినేతకు ఉపముఖ్యమంత్రి పదవి లభించింది. హరియాణా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దుష్యంత్​ చౌతాలా, ఆయన పార్టీ జేజేపీ కథ ఇది.

అనూహ్యంగా...

హరియాణా శాసనసభ ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తలకిందులు చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి. మనోహర్​లాల్​ ఖట్టర్​ నేతృత్వంలో కమలదళం... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధిస్తుందన్న సర్వేలు తారుమారయ్యాయి. భాజపా రెండోసారి అధికారం దక్కించుకునేందుకు ఇతరుల మద్దతు అనివార్యమైంది.

ఏడుగురు స్వతంత్రుల మద్దతుతో ఖట్టర్​ సర్కార్​ కొలువుదీరే అవకాశమున్నా... 10 స్థానాలు గెలిచిన 'జననాయక్​ జనతా​ పార్టీ (జేజేపీ)'ని కీలక భాగస్వామిగా పరిగణించింది భాజపా. ఆ పార్టీ అధినేత దుష్యంత్​ చౌతాలాకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చింది.

ఉచానా కలన్​ నుంచి చౌతాలా గెలుపు

శాసనసభ ఎన్నికల్లో హిసార్​లోని జింద్​ జిల్లా ఉచానా కలన్​ నియోజకవర్గం నుంచి విజయకేతనం ఎగురవేశారు దుష్యంత్​. కేంద్ర మాజీమంత్రి చౌదరి బీరేందర్​ సింగ్​ భార్య, సిట్టింగ్​ ఎమ్మెల్యే ప్రేమ్​లతపై గెలుపొందారు.

దేవీలాల్​ కుటుంబం నుంచి...

మాజీ ఉప ప్రధాని, హరియాణా మాజీ ముఖ్యమంత్రి 'దేవీలాల్'​ ముని మనుమడు దుష్యంత్​. ఐఎన్‌ఎల్‌డీ అగ్రనేత ఓం ప్రకాశ్‌ చౌతాలాకు మనుమడు. 26 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేశారు దుష్యంత్. దేవీలాల్​ కుటుంబం నుంచి అతిపిన్న వయసులోనే ఎన్నికల బరిలోకి దిగిన నేతగా గుర్తింపు పొందారు. 2014 లోక్​సభ​ ఎన్నికల్లో ఐఎన్ఎల్​డీ తరఫున ఘన విజయం సాధించారు. హిసార్​ లోక్​సభ ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు.

పార్టీ నుంచి బహిష్కరణ

దేవీలాల్​ స్థాపించిన ఇండియన్​ నేషనల్ లోక్​దళ్​(ఐఎన్​ఎల్​డీ)లో ఆధిపత్యం కోసం ఆయన ఇద్దరు మనుమళ్లు అజయ్​ చౌతాలా, అభయ్​ చౌతాల మధ్య తీవ్రస్థాయిలో పోరు నడిచింది. 2018లో అధికార కలహాలు తారస్థాయికి చేరినందున అజయ్​తో పాటు ఆయన కుమారులు దుష్యంత్​, దిగ్విజయ్​ను పార్టీ నుంచి బహిష్కరించారు ఓం ప్రకాశ్​ చౌతాలా. ఫలితంగా 2018 డిసెంబర్​ 9న 'జననాయక్​ జనతాపార్టీ (జేజేపీ)'ని స్థాపించారు దుష్యంత్​. ఆయన ముత్తాత చౌదరి దేవీలాల్​ను ప్రజలు జననాయక్​ అని పిలిచేవారు. అందుకే ఆయన పేరుతోనే పార్టీని స్థాపించారు దుష్యంత్​.

జాట్ల ప్రాబల్యం..

హరియాణాలో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. చౌతాలా కుటుంబంతో పాటు కాంగ్రెస్‌నేత భూపిందర్‌సింగ్ హుడా అదే వర్గానికి చెందినవారు. 2014 ఎన్నికల్లో జాటేతర సీఎంగా మనోహర్‌ ఖట్టర్‌ పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో జాట్లు మళ్లీ ఏకమై దుష్యంత్‌కు మద్దతు ఇచ్చినందున జేజేపీ కీలకంగా మారింది.

ఇదీ చూడండి: దశాబ్దం తర్వాత 'హరియాణా' చరిత్ర పునరావృతం

Last Updated : Oct 27, 2019, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details