పాకిస్థాన్లో సిక్కులపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. పవిత్ర నన్కానా సాహిబ్ గురుద్వారాపై దాడిని మరువకముందే పెషావర్లో ఓ సిక్కు యువకుడిని కొంతమంది దుండగులు హతమార్చారు. సిక్కులపై పాకిస్థాన్లో జరుగుతోన్న విధ్వంసాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ అసత్యాలు పలకడం మానేసి నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
పెషావర్లో సిక్కు యువకుడిని అత్యంత కిరాతకంగా హతమార్చడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇటీవల నన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడి, బలవంతంగా ఓ సిక్కు అమ్మాయికి మత మార్పిడి చేసి వివాహం చేసుకున్న ఘటనలపై పాక్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.