సిద్ధార్థ గౌడ పాటిల్.. సరిగా మాటలు రాని వయస్సులోనే తన తెలివితేటలతో అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. అబ్బురపరిచే జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్నాడు. నడిచే కంప్యూటర్‌గా పిలిచే ఆ బాల మేధావికి.. గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది తమిళనాడుకు చెందిన "ది యూనివర్సల్ తమిళ్" విశ్వవిద్యాలయం.
కర్ణాటక హుబ్బల్లిలోని తబీబ్ ల్యాండ్ ప్రాంతానికి చెందిన గిరీష్ గౌడ పాటిల్, శివలీలా పాటిల్ దంపతుల కుమారుడు సిద్ధార్థ గౌడ పాటిల్. నవనగర్‌లోని రాష్ట్ర విద్యానికేతన్ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై ఏ విధమైన ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానమిచ్చే ఆ బుడతడు తన ప్రతిభతో సత్తా చాటుతున్నాడు.
ఎవరి గురించి అడిగినా..
వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి చిత్రాలను సులభంగా గుర్తిస్తాడు సిద్ధార్థ. వారి గురించి గుక్కతిప్పుకోకుండా అనర్గళంగా చెప్పగలడు కూడా. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, శాస్త్రవేత్తలు, స్వతంత్ర సమరయోధులు, రచయితలు ఇలా ఎవరి గురించి అడిగినా ఇట్టే చెప్పేస్తాడు పాటిల్.
ఆధ్యాత్మికత ఎక్కువే..
సిద్ధార్థకు దైవ భక్తి ఎక్కువ. శ్లోకాలు పఠించడమంటే ఇష్టమని చెబుతున్నాడు ఈ బుడతడు. రోజు ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేచి స్నానం చేసుకుని పూజ చేసిన తర్వాతే పాఠశాలకు వెళతాడు. అతడి తల్లిదండ్రులు, నానమ్మ చెప్పిన ఆధ్యాత్మిక కథలు, వర్తమాన అంశాలు, మతపరమైన విషయాలను గుర్తుపెట్టుకొని తిరిగి అప్పజెప్పటం సిద్ధార్థ దినచర్యల్లో ఒకటి.