ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ జన్మభూమి అయోధ్యలో ఇవాళ రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా ప్రధాని ఒకే రోజు మూడు జాతీయ రికార్డులు సృష్టించటం గమనార్హం.
నేటి కార్యక్రమం ద్వారా అయోధ్యలో రామమందిరాన్ని దర్శించిన తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మహిమాన్వితమైనదిగా భావించే ఇక్కడి హనుమాన్ గడి మందిరాన్ని దేశ ప్రధానమంత్రి దర్శించటం కూడా ఇదే తొలిసారి. ఇక దేశ సంస్కృతి పరిరక్షణకు చిహ్నంగా భావిస్తున్న దేవాలయ భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనటం ఇదే ప్రథమం కావటం ముచ్చటగా మూడవ రికార్డు.
అయోధ్యలో మోదీ: మినిట్-టు-మినిట్
రామజన్మభూమి అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు కొద్దిమంది ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు. సుదీర్ఘకాలం తరువాత నరేంద్ర మోదీ అయోధ్యలో అడుగుపెట్టడం విశేషం. అయోధ్యలో మోదీ పర్యటన సాగిందిలా..
- ఉ.11.40- నిమిషాలకు అయోధ్య చేరుకున్న మోదీ. స్వాగతం పలికిన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తదితరులు..
- 11.45- హనుమాన్‌గఢీ ఆలయం సందర్శన. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. హనుమాన్‌కు హారతి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..
- 11.50- అయోధ్య రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి పూజలు.. సాష్టాంగ నమస్కారం, అనంతరం ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు.
- 11.55- రామాలయం నుంచి భూమిపూజకు బయలు దేరిన మోదీ. ప్రధానితో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా ప్రధాని వెంటే ఉన్నారు.
- మ.12.08- నిమిషాలకు భూమిపూజ ప్రదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ
- 12.15- రామమందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ప్రారంభం
- 12.49- ముగిసిన భూమిపూజ క్రతువు
- 12.50- అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులైన ప్రధాని, యూపీ గవర్నర్, ముఖ్యమంత్రి, రామమందిర ట్రస్ట్ సారథి మహంత్ నృత్యగోపాల్ దాస్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్.
- 1.00- తొలుత యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రసంగం. అనంతరం మోహన్ భగవత్, నృత్యగోపాల్ దాస్‌లు ప్రసంగించారు. చివరగా ప్రధాని మోదీ మాట్లాడారు.
- 1.30- ప్రసంగం ప్రారంభించే ముందు శ్రీరాముని చిహ్నంగా తపాలా బిళ్ల విడుదల చేసిన మోదీ
- 1.31- ప్రసంగం ప్రారంభం. 35నిమిషాల పాటు మాట్లాడిన ప్రధాని
- 2.07ని.లకు మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు.