స్వాతంత్ర్య అనంతరం రాసిన చరిత్రలో పలు ముఖ్యమైన అధ్యయనాలు, అంశాలను చరిత్రకారులు విస్మరించారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచం ముందు ఉన్నతమైన భారత సంస్కృతిని చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారసత్వ కట్టడాలను పర్యటకంగా అభివృద్ధి చేయడం ద్వారా ఇది సాధ్యమౌతుందన్నారు. బంగాల్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి హావ్డా వంతన వద్ద లైట్షోను ప్రారంభించారు. హూబ్లీ నది తీరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు ప్రధాని.
అంతకుముందు వారసత్వ భవంతులైన ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్, బెల్వెదెరె హౌస్, మెట్ కాఫె హౌస్, విక్టోరియా మెమోరియల్ హాలును జాతికి అంకితం చేశారు. ఈ నాలుగు భవంతులను ఇటీవల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పునరుద్ధరించింది.
"బంగాల్ సహా భారత్ కళా, సాహిత్య రంగాల్లో ఈ రోజు అత్యంత ప్రాముఖ్యమైనది. పునస్థాపన, పునఃవ్యవస్థీరణ, నవీకరణ దిశగా జాతీయ స్థాయి పథకాన్ని బంగాల్ నుంచి నేడు ప్రారంభిస్తున్నాం. పరంపర, పర్యటకం అనేవి మన వారసత్వ సంపద, భావాలు, మన గుర్తింపుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి."