భిన్నత్వంలో ఏకత్వమే భారత ఆత్మగౌరవమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియా వద్దనున్న పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సర్దార్ పటేల్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
అఖండ భారత నిర్మాణంపై సర్దార్ ముందుచూపు ప్రస్తుతం మనకు అనుభవంలోకి వస్తోందన్నారు మోదీ. సర్దార్ పటేల్ జయంతిరోజునే ఆయన కలలు కన్న భారత్‌లో జమ్ముకశ్మీర్ విలీనం సాధ్యమవుతుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కశ్మీర్ నేటి నుంచి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు.
"దేశ ఐక్యత, అఖండ భారత నిర్మాణంపై ఆయన అభిప్రాయంలో ఉన్న ఆలోచన మన అనుభవంలోకి వచ్చింది. ఆయన మాటల్లో ఉన్న శక్తి.. భావాల్లో ఉన్న ప్రేరణను ప్రతి భారతీయుడు అర్థం చేసుకోగలుగుతున్నారు. సర్దార్ భావాలను ఆయన విగ్రహం వద్ద గుర్తు చేసుకోవడం ఎంతో విశేషం. ఈ ప్రతిమ మన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. మేల్కొలిపే సందేశం. ఇది దృష్టిలో ఉంచుకుని.. ఐక్యతా పరుగు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేడు నిర్వహించాం. భిన్నత్వంలో ఏకత్వమే భారత విశిష్టత. మనం భిన్నత్వంతో నిండి ఉన్నాం. భిన్నత్వంలో ఏకత్వమే మన గర్వం, గౌరవం, హూందాతనం, గుర్తింపు.
సర్దార్ పటేల్ కలను పూర్తి చేసే అవకాశం రావడం మనందరి భాగ్యం. ఈ రోజు జమ్ముకశ్మీర్, లద్దాఖ్ నూతన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాయి. సర్దార్ జయంతి రోజునే ఉజ్వల భవిష్యత్ కోసం జమ్ముకశ్మీర్ బలంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో రాజకీయ స్థిరత్వం వస్తుంది. స్వార్థం కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, కూలదోయడం ఆగిపోతుంది. సహకార సమాఖ్య అసలైన భాగస్వామ్యం.. అభివృద్ధి దిశగా అడుగుతో అడుగు కలిపి నడిచే యుగం ప్రారంభమవుతుంది."