మోటార్ వాహనాల ప్రమాద బాధితులకు రక్షణ కల్పించేలా ప్రతిపాదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర రహదారులు, రవాణాశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సోమవారం.. లోక్‌సభ ముందుకు మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చారు. వాహన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం అందజేసేలా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. మోటార్ వాహనం యజమాని లేదా బీమా కంపెనీ పరిహారాన్ని అందజేసేలా ప్రతిపాదించారు.
భారీ జరిమానాలు...
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించేలా పలు సవరణలు ప్రతిపాదించారు. ఆన్‌లైన్‌లోనే లెర్నింగ్ లైసెన్స్‌ల మంజూరు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులు, వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేలా ఇన్సూరెన్స్ నిబంధనలు సరళీకరించాలని ప్రతిపాదించారు. ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ రెన్యువల్ కాలపరిమితిని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచనున్నారు. దివ్యాంగులకు లైసెన్స్‌లు జారీచేసేలా ప్రతిపాదనలు చేశారు. కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గడువును నెల రోజుల నుంచి సంవత్సరానికి పెంచాలని ప్రతిపాదించారు.