సార్వత్రిక సమరం నాలుగో దశకు చేరుకుంది. 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతుంది. వీటితోపాటు జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ నియోజకవర్గంలోని కుల్గాం జిల్లాలోనూ ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. భద్రతా కారణాల దృష్ట్యా అనంత్‌నాగ్‌కు 3 దశల్లో పోలింగ్ ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
4వ దశలో పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో గడువు ముగిసింది. 71 స్థానాల్లో 12.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం లక్షా 37 వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఈసీ. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయి సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది.
71 నియోజకవర్గాల నుంచి 943 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 98మంది మహిళలు.
కట్టుదిట్టమైన భద్రత
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరిస్తోంది. 2 లక్షల 70 వేల మంది పారామిలటరీ బలగాలు, 20 లక్షల మంది వివిధ రాష్ట్రాల పోలీసులు, హోంగార్డులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎన్నికల సంఘం కోరిన మేరకు 2710 కంపెనీల పారామిలటరీ బలగాలను లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పంపినట్లు వివరించింది. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరా నిఘాను ఏర్పాటు చేస్తోంది.