కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రోటోకాల్‌కు అనుగుణంగా కచ్చితంగా నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోటోకాల్ నిబంధనలను పాటించకపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని గమనించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కేంద్రం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సమాజంలో కీలక స్థానం ఉందన్న కేంద్రం.. వారి బాధ్యతల్లో భాగంగా వివిధ శాఖల అధికారుల నుంచి సమాచారం తెలుసుకోవచ్చని, అలాగే అవసరమైతే సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.